రంగా రెడ్డి జనవరి 29 (ఈ బీ న్యూ స్);రాజేంద్రనగర్ పరిధిలోని నార్సింగి వద్ద ఓ మహిళ ఎండిఎంఏ డ్రగ్స్ తో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులకు పట్టుబడడం కలకలం సృష్టించింది. ఈ మేరకు పట్టుబడ్డ నిందితురాలు లావణ్య నుండి 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మత్తు పదార్థాలతో పట్టుబడ్డ లావణ్య కు సినీ హీరోతో సంబంధం ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఏసీపీ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం…..మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతున్న సైబరాబాద్ పోలీసులు ఖచ్చితమైన సమాచారం మేరకు నార్సింగి వద్ద లావణ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆమె వద్ద నుండి 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు గోవా నుండి డ్రగ్స్ హైదరాబాద్ కు తీసుకొచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితురాలు లావణ్యను ఎస్వోటీ టీమ్ తదుపరి విచారణ నిమిత్తం నార్సింగి పోలీసులు అప్పగించడం తో నిందితురాలి పై ఎన్ డి పీఎస్ యాక్టు కింద కేసు నమోదు చేశారు.ఇదిలా ఉండగా మత్తు పదార్థాలతో పోలీసులకు పట్టుబడ్డ నిందితురాలు లావణ్యకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరోతో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ హీరో ఎవరన్నది కూపీ లాగుతున్నారు. అంతేకాకుండా సినీ పరిశ్రమలో లావణ్య కు ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.















