హైదరాబాద్ ఏప్రిల్ 5 (ఈతరం భారతం న్యూస్ );: పర్యావరణాన్ని ఎలా కాపాడుతాయో రాజకీయ పార్టీలు వెల్లడించాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. గడచిన అర్ధ శతా బ్దానికి పైగా ప్రకృతి – పర్యావరణం తీవ్ర దురభిక్ష పరిస్థితిని అనుభవిస్తూ అనేక విపత్తులకు కారణమవుతోందని, పర్యావరణ సమతులతకు ఒక ప్రత్యేక కార్యాచరణ ఏ పాలక పార్టీ తీసుకోలేదని కౌన్సిల్ అధ్యక్ష, సలహాదారులు ఎస్సీహెచ్ రంగయ్య, డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు ఆరోపించారు. పాలకుల ఉదాసీనత కారణంగా సామాజిక భవితవ్యం అగమ్య గోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయరంగం అంటే నిస్వార్ధంగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన ఒక వ్యవస్థ అన్నారు. అయితే రాజకీయ నేతలు, పార్టీలు దానికి భిన్నంగా వ్యవహారిస్తూ వ్యవస్థను బ్రష్టు పట్టించారని మండిపడ్డారు. నాయకులకు కనీస సామాజిక బాధ్యత ఉన్నా ఇవాళ ఈ కరువు కాటకాలు చవిచూడాల్సిన పరిస్థితి ఉండేది కాదన్నారు. కేవలం వ్యాపారధోరణితో రాజకీయాలు చేస్తూ పర్యావరణ బలోపేతం చేయాల్సిన బాధ్యతను గాలికొదిలేచారని దుయ్యబట్టారు. ఏ వ్యవస్థ మనుగడ అయినా ప్రకృతి -పర్యావరణ పరిరక్షణ పైనే ఆధార పడి ఉంటుందన్న వాస్తవాన్ని నాయకులు మరిచారని అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాల మనుగడ కు కీలకమైన పర్యావరణాన్ని కాపాడలేని నాయకులకు రాజకీయంగా చలామణి అయ్యే అర్హత లేదని, ఇప్పటికైనా నాయకులు పర్యావరణ రక్షణకు కట్టుబడి ఉంటామని వారి పార్టీల మేనిపెస్టో ద్వారా ప్రజలకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయం అంటే సంపాదన, వ్యాపారం కాదని సామాజిక పరిరక్షణ బాధ్యుత అని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో పర్యావరణ విజన్ తో ముందుకు వచ్చి ఓట్లు అడగాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.















