యాదాద్రి భువనగిరి జనవరి 26(ఈ బీ న్యూస్): జానపద పౌరాణిక కళారూపాలకు తెలంగాణ పుట్టినిల్లు అని రంగస్థల నటనను ఆదరించి రక్షించాలని ప్రముఖ కవి సీనియర్ జర్నలిస్టు తిరునగరి శ్రీనివాస్ అన్నారు. ఆలేరు బిసి కాలనీలో మనీష్ గౌర్ హాలివుడ్ ఫిలిమ్స్,సురభి కళాకారుల కాంబినేషన్ తో టి.రాము ఆధ్వర్యంలో రామ భక్త హనుమ నాటక ప్రదర్శన, నిర్వహించారు.కళాకారుల నాటక ప్రదర్శన ప్రేక్షకుల కళ్లకు కట్టి పడేవిధంగా ఆద్యంతం మైమరపించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తిరునగరి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో నాటక ప్రదర్శనలకు అంతగా ప్రోత్సాహం లేదని రంగస్థల నటనను,పౌరాణిక, జానపద కళారూపాలను నేటి తరానికి
వారసత్వ సంపదగా అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.కులం,మతం,ప్రాంతం, భాషాబేధం కళాకారులకు ఉండదని చెరిగిపోని జ్ఞాపకం నాటకమని చెప్పారు. ప్రస్తుతం సినిమా యుగంలో ప్రతిరోజూ సినిమాలు చూస్తుంటామని కానీ ఎన్నో రోజులు ఎంతో మంది కళాకారులు నటన తర్వాత మార్పులు చేర్పుల అనంతరం సినిమా చూడగలమని కానీ నాటక ప్రదర్శనలో ఒక పాత్రధారుడు ఒకే కాలంలో విభిన్న పాత్రలను అప్పటికప్పుడు పండించి ప్రేక్షలను మైమరపింపజేసే నటన కేవలం రంగస్థల కళాకారులకే సాధ్యమని అన్నారు.తెలంగాణ ప్రాంతంలో ఆనాటి కళారూపాలు, పౌరాణిక నాటకాలు కనుమరుగై పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకు పాలకులు, ప్రజల తోడ్పాటు అవసరం అని చెప్పారు.కార్యక్రమాన్ని నిర్వహించిన టి.రాము మాట్లాడుతూ సురభి కళాకారులు నాటక ప్రదర్శనలు పలు ప్రాంతాలలో నిర్వహించామని నేడు ఆలేరులోరామభక్త హనుమ నాటక ప్రదర్శన ఇచ్చామని చెప్పారు.
మనీష్ గౌర్ హాలివుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఇప్పటికి 3 సినిమాలు తీయడం జరిగిందని వాటితో పాటుగా సురభి నాటక ప్రదర్శనలు చేస్తున్నామని చెప్పారు. నేటి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.ఎన్టీఆర్ అవార్డు గ్రహీత రామశర్మ, సురభి అరుణాదేవి,సురభి శేషుకుమారి,సినీ ఆర్టిస్ట్ ఇంద్ర,కత్తి సుందరమ్మ,సురభి అమృత,సురభి ప్రియాంక నాగమణి, అన్నపూర్ణ, హార్మోనియం తిరుపతయ్య,ధనుంజయ, చరణ్ లతో కళాకారులతో పాటుగా భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు.















