యాదాద్రి భువనగిరి, జనవరి 25,(EB news) ప్రజా స్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, ఓటు విలువ తెలుసుకొని సరైన దిశలో ఓటు వినియోగించుకోవాలని ఆలేరు తహసీల్దారు శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆలేరు ఎన్సిసి విభాగం మరియు తహసీల్దారు కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా, డబ్బులకు ప్రలోభ పడకుండా, కుల మత, భాషాపరమైన ప్రభావాలకు లోను కాకుండా ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని ఆయన అన్నారు. ప్రతి ఓటు ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైనదని, ఓటు వేయడం ప్రతి పౌరుని బాధ్యతని తెలిపారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు వినియోగాన్ని ప్రతి ఓటరు బాధ్యతగా స్వీకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై ఎన్సీసీ క్యాడేట్లు ఓటు విలువ తెలుపుతూ ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి అధికారి దూడల వెంకటేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్యామసుందరి, నాయబ్ తహసీల్దార్ ప్రణయ్, ఆర్ ఐ లు సత్యనారాయణ రెడ్డి, నాగేశ్వర చారి, కిష్టు, సైదా ఉపాధ్యాయులు శేఖర్, హరినాద్ రెడ్డి, మంద సోమరాజు, సాంబశివ, నవీన్ కుమార్, కాజా అలీ, రవి, వేణు, విజయలక్ష్మి, లక్ష్మమ్మ, కవిత, స్వర్ణలత, మీరా, దుర్గమ్మ తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది న్యాతకాని కార్తీక్, తేజ తదితరులు పాల్గొన్నారు.















