EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రజా ప్రభుత్వంలో డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల కష్టాలు తీరేనా…! తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ – రాష్ట్ర అధ్యక్షులు: డాక్టర్. కొర్ర ఈశ్వర్ లాల్

6.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

2012 వ సంవత్సరంలో మొదలైన గెస్ట్ లెక్చలర్ల వ్యవస్థ లో ప్రస్తుతం రాష్ట్రంలో 145 డిగ్రీ కళాశాలలో ఆర్థిక శాఖ అనుమతి పొందిన1940 శాంక్షన్ పోస్టుల్లో ప్రస్తుతం1600 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరిలో డాక్టరేట్ పట్టాలు,నెట్ మరియు సెట్ లాంటి ఉన్నతవిద్య అర్హతలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం 6 ప్రభుత్వ యూనివర్సిటీల పరిధిలో ప్రభుత్వ,ఎయిడ్,అన్ ఎయిడ్ 226 డిగ్రీ కాలేజీలలో 200 కోర్సుల్లో ప్రతి సంవత్సరం 1,27,000 మందికి పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు.10 సంవత్సరాల నుండి డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా లెక్చరర్ల పోస్టుల భర్తీ చేయని కారణం ఒకటైతే ,ఇంటర్ కాలేజీలలో నుండి ప్రమోషన్లు పొంది డిగ్రీ కాలేజీలకు రాకపోవడం వల్ల ప్రభుత్వం గత 12 సంవత్సరాల నుండి గెస్ట్ లెక్చలర్ల సేవలను వినియోగించుకుంటు రాష్ట్రం లో అన్నీ డిగ్రీ కళాశాలలో 60 నుండి 70% వరకు గేస్ట్ లెక్చలర్లతోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే 25 కళాశాలలో 300 పైగా గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారంటే డిగ్రీ విద్య వ్యవస్థను పటిష్టం చేయడంలో గెస్టులెక్కల్లర్ల అవసరం ఎంత ఉందో తెలుస్తుంది.ఇలాగే ప్రతి కళాశాలలో 10 నుండి 30 కి పైగానే గేస్ట్ లెక్చలర్లతోనే డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ కేవలం 1400 (కాంట్రాక్ట్ నుండి రెగ్యులర్ అయిన వారిని కలుపుకొని) మంది మాత్రమే. కాంట్రాక్టు లెక్చరర్లు 500 మంది మరియు గేస్ట్ లెక్చరర్లు 1600 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంట్రాక్టు వ్యవస్థలో కొనసాగిన డిగ్రీ లెక్చలర్ల ను గత ప్రభుత్వం రెగ్యులర్ చేయడం జరిగింది. కానీ గెస్ట్ ఫ్యాకల్టీలో పది సంవత్సరాల పైబడి పనిచేస్తున్న వారిని, అన్ని విద్య అర్హతలు కలిగి ఉన్న మాకు కాంట్రాక్టు పద్ధతిలో మర్చరు, 12 నెలలకు జీతాలు ఇవ్వరు, సర్వీస్ ని కంటిన్యూ చేయరు. ఒకే రాష్ట్రంలో ఒకే వ్యవస్థలో పనిచేస్తున్న వారిని రెండు విధాలుగా చూడడం ఎంతవరకు న్యాయం.

ప్రస్తుతం 10 ,5, మరియు 2,3 సంవత్సరాల నుండి డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న వారు కూడా ప్రతి సంవత్సరం ఉన్నత విద్య కమిషనరేట్ వారు జారీ చేసే నోటిఫికేషన్ ద్వారా మరియు త్రీ మెన్ కమిటీతో ప్రతి సంవత్సరం డెమో ఇచ్చుకుంటూ ఎంపిక కాబడిన వారు కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ లో మళ్లీ డెమో అనే నియమం తో మళ్లీ కొత్తగా జాయిన్ కావలసిన వింత పరిస్థితి. తెలంగాణలోని రెసిడెన్షియల్ కాలేజీలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు ఒక్కసారి డెమో చెప్పి కన్సాలిడేటెడ్ పే తో కంటిన్యూవేషన్ గా కొనసాగుతారు, ఇంటర్, కేజీబీవీ ఇంటర్ కాలేజీల విద్యా వ్యవస్థలో కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. కానీ కేవలం డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు మాత్రం భయం భయంతో, తీవ్ర ఆందోళన మధ్య , ప్రిన్సిపల్స్ మెప్పుకోసం ఉపగ్రహాలుగా తిరుగుతూ మరియు కాలేజీలో ఉన్న మిగతా రెగ్యులర్, కాంట్రాక్టు , నాన్ టీచింగ్ వారితో అన్యోన్యంగా ఉంటూ వారి పనులు చేస్తూ, వింటూ,ప్రసన్నం చేసుకుంటూ అడ్మిషన్లు మొదలైనప్పుడు కాన్వాసింగ్ చేసుకుంటూ ,విద్యార్థుల పాస్ పర్సంటేజీ పడిపోకుండా చూసుకుంటూ, కాలేజీలో పోటీపడి విద్యా బోధన చేస్తూ గాడిద కష్టం చేసిన ఆరు , ఏడు నెలల కాలానికి వచ్చే జీతం కోసం అందర్నీ మెప్పించి, ఒప్పించిన చివరికి ప్రతి సంవత్సరం ఆట మొదటి నుండి ఆడాలనే నియమం వల్ల మానసిక ఒత్తిడి, క్షోభ ,వేదనతో పాటు రెగ్యులర్,కాంట్రాక్టు ఉద్యోగుల మధ్య అనునిత్యం రెగ్యులర్,కాంట్రాక్ట్ ఉద్యోగులతో సమానం కాదనే భావనతో వివక్షతకు గురవుతూ బానిసలుగా బ్రతుకవలసిన వ్యవస్థ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న ప్రతి లెక్చలర్ అనుభవిస్తున్న వింత జీవితం భరించరానిది.

ప్రతి సంవత్సరం లెక్చరర్లను పూర్తి విద్యా సంవత్సర కాలానికి నియమించుకొని యూనివర్సిటీల అల్మానక్ మరియు సెమిస్టర్ విధానం అమలు వల్ల రెండు సెమిస్టర్లు కలిపి 180-200 రోజులకి మాత్రమే వేతనం ఇవ్వడం తో ,ఆరు, ఏడు నెలలకే వేతనం పొందడం. ఉదాహరణకు అక్టోబర్ నెలలో దసరా సెలవులు, విద్యార్థులకు పరీక్షల కారణంగా డిసెంబర్ లో మరియు జనవరి లో సంక్రాంతి సెలవుల కారణంగా మొత్తం రెండు నెలల కు ఒక్క రూపాయి కూడా వేతనం పొందని గెస్ట్ అధ్యాపకుల కుటుంబాలను అరకొర జీతాలతో నెట్టుకు రావడం భారంగా మారింది. కుటుంబ పోషణ, నెలనెల సరుకులు ,రవాణా చార్జీలు, పండుగలు మరియు ఇన్సూరెన్స్ ఇతర ఖర్చులు గెస్ట్ లెక్చలర్ల పిల్లలను ఒక మంచి స్కూలు ,కాలేజీలో చదివించుకోలేని దౌర్భాగ్యస్థితి మరియు ఇదే గెస్టు వ్యవస్థలో పనిచేస్తూ సంవత్సరానికి రెండు లక్షల వేతనంతో 30 సంవత్సరాలు సర్వీస్ చేసినా సొంత ఇల్లు కట్టుకోలేని విచిత్ర పరిస్థితి. మహిళలకు ప్రసూతి, చైల్డ్ కేర్ సెలవులు, అలాగే గెస్ట్ లెక్చలర్లు ఏదన్న ఆపద వచ్చిన, ప్రమాదాలు జరిగిన ఆ రోజుల్లో కాలేజీకి రాకపోతే వేతనం రాదు. పెళ్లి కానీ యువ అతిథి అధ్యాపకులకు భద్రత లేని,ఎప్పుడు ఊడగోడతారో తెలియని కారణంగా పెళ్లి సంబందాలు రావడం లేదు అనే ఆవేదనతో పాటు మానసిక సంఘర్షణకు గురి అవుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అతిథి అధ్యాపకుల సమస్యలు, జీవితం ఎలా ఉందంటే రాస్తే రామాయణమంతా చెబితే మహాభారతం అంత ఉంటుంది. ఇలాంటి వింత విషయం ఎక్కడ విని ఉండరు ఎందుకంటే , సెలవులు వస్తే విద్యార్థులకు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఆనందం కానీ అతిథి అధ్యాపకులకు సెలవులు వస్తే భయం, ఆందోళన ఎందుకంటే ? ప్రభుత్వ సెలవులు ఇచ్చిన, లోకల్ హాలిడే మరియు ఆప్షనల్ సెలవులు తీసుకున్న చివరికి విద్యార్థులకు పరీక్షలు జరిగిన ఆ రోజులకు గెస్ట్ లెక్చరర్లు వేతనం పొందే అవకాశం ఉండదు పాఠం బోధిస్తేనే ఆ రోజుకు వేతనం. ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో పేదలకు 100 రోజుల ఉపాధి హామీ పని పథకంలగా ఉన్నది. పేదలకు 100 రోజుల పని దొరుకుతే ఉన్నత విద్యావంతులైన ,భావి భారత పౌరులను తయారు చేసే మరియు దేశ దశ,దిశను విద్యార్థులను ఉన్నత స్థానాలలో, అధికారులుగా నిలిపే గురువులకు మాత్రం 200 రోజుల పని దొరుకుతుంది. అతిథి అధ్యాపకుల కు ఉద్యోగ భద్రత లేని కారణంగా గెస్ట్ లెక్చరర్లు చనిపోయిన ,ఏదన్న ప్రమాదాలు జరిగిన సర్వం కోల్పోవాల్సిందే గాని ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సహాయం అందదు. అలాగే వారి కుటుంబలకు భవిష్యత్తులో భద్రత, పెన్షన్లు కూడా ఉండవు. భవన నిర్మాణ,ప్రైవేట్ కంపెనీలలో కార్మికులుగా పనిచేస్తున్న వారికి కనీస హక్కులు అయినా అమలు అవుతాయి కానీ అతిథి అధ్యాపకులు రోజు కూలీల కన్నా అద్వానమైన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజాస్వామ్య దేశం లో కూడా బానిస, వెట్టి చాకిరి పద్ధతికి ఇది ప్రతిరూపంగా నిలిచింది. రాజ్యాంగ స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విలువ లేకుండా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కన్సాలిడేటెడ్ పే మరియు ఉద్యోగ భద్రత ఇస్తామన్నా ఈ అంశం చేర్చడం జరిగింది. గత ప్రభుత్వానికి టెస్ట్ లెక్చలర్ల సమస్యలపై అసెంబ్లీ సాక్షిగా ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆటో రెన్యువల్ మరియు కన్సల్టెడ్ ఇస్తామన్న హామీని నెరవేర్చలేకపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఏర్పాటు కావడం జరిగింది కావున ఈ విషయం పై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రస్తుతం పనిచేస్తున్న 1600 మంది అతిథి అధ్యాపకుల ప్రధాన డిమాండ్ 1. ప్రస్తుతం పని చేస్తున్న గేస్ట్ లెక్చలర్లను ఆటో రెన్యువల్ చేసి సర్వీసును కంటిన్యూ చేయాలి 2. 12 నెలలకు యూజీసీ నిబంధనల ప్రకారం పీరియడ్ విధానం రద్దు చేసి ప్రతి నెలకు 50 వేల ఏకీకృత వేతనాలు చెల్లించాలి. 3. డెమో తీసుకొని పునర్ నియమించే విధానానికి స్వస్తి పలికి ఉద్యోగ భద్రత కల్పించి మినిమం టైం స్కేల్ ఉద్యోగులుగా గుర్తించాలి 4. ప్రమాద బీమా సౌకర్యం కల్పించి తగు న్యాయం చేయాలి. 5. మూడు సంవత్సరాల పైబడి బోధన చేస్తున్న లెక్చలర్లందరికీ ఈక్వాలేంట్ సెట్ సర్టిఫికెట్ ను కమిషనర్ చే జారీ చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా 15 సం.లుగా డిగ్రీ లెక్చలర్ల రిక్రూట్మెంట్ సరిగ్గా లేకపోవడం, గేస్ట్ లెక్చలర్లను 6 ,7 నెలల కాలానికే సేవలు వినియోగించుకోవడంతో నాణ్యమైన, శాస్త్రీయ విద్య అందకపోవడంతో విద్యార్థుల హాజరు శాతం తగ్గి ఆశించినంత స్థాయిలో విద్యార్థులకు వారి శక్తి సామర్థ్యాలను వెలికి తీసే అవకాశం తగ్గిపోయింది మరియు దేశంలో మరియు రాష్ట్రంలో అత్యున్నత స్థాయి ఉద్యోగాలైన గ్రూప్స్, సివిల్స్, రైల్వే మరియు బ్యాంకింగ్ కు చదివే విద్యార్థుల సంఖ్య గ్రామీణ ప్రాంతంలో తగ్గిపోతుంది అలాంటి ఉద్యోగాలు పొందే వారి సంఖ్య కేవలం 2,3 శాతానికి మించడం లేదు. కావున ప్రపంచంలో అభివృద్ధి చెందిన మరియు చిన్న దేశాలు కూడా నేడు విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ లో 10 నుండి 30 శాతం విద్య కోసం ఖర్చు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ శాస్త్ర ,సాంకేతిక మరియు పరిశోధన రంగాలతో పాటుగా విలువలతో కూడిన విద్యను అందిస్తూ అక్కడ దేశ ప్రజలకు అత్యుత్తమ పాలన ,అభివృద్ధి మరియు ప్రగతికి మూలంగా విద్య ద్వారానే సాధ్యం అని రుజువు చేస్తున్నారు.

నెల్సన్ మండేలా పేర్కొన్న సూక్తి “ప్రపంచంలో అన్ని ఆయుధాల కన్నా విద్యనే అత్యున్నతమైందని, ప్రపంచ అభివృద్ధికి విద్య మాస్టర్ కీ గా పని చేస్తుందనే” విషయాన్ని గుర్తు చేస్తూ నేడు తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను తీర్చడంలో ముందు ఉంటుందని భరోసా కల్పిస్తున్న మా బలం, నమ్మకం , మాట తప్పని, మడమ తిప్పని ప్రజాసేవక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డిగ్రీ అతిథి అధ్యాపకులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.

తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ – రాష్ట్ర అధ్యక్షులు: డాక్టర్. కొర్ర ఈశ్వర్ లాల్, ఎం.ఏ, బి.ఈడి, పి.హెచ్.డి, 9491111983.

Related News

Select the Topic
Scroll to Top