
హైదరాబాద్ మే 19 (ఈతరం భారతం న్యూస్ ):బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆన్ లైన్ https://mjpabcwreis.cgg.gov.in/లో అందుబాటులో ఉంచామని తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు, ఐ ఎఫ్ ఎస్ గారు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ బీసీ గురుకుల జూనియర్ కళాశాలలో అడ్మిషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 208 కేంద్రాల్లో ఏప్రిల్ 28న నిర్వహించిన ప్రవేశ పరీక్ష లో మెరిట్ సాధించిన విద్యార్థులు తమకు అలాట్ చేసిన కాలేజీల్లో ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ లోగా రిపోర్ట్ చేయాలని సైదులు గారు పేర్కొన్నారు. బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఎంపిసీలో 8624, బైపిసిలో 6463, ఎంఇసిలో 484, సిఇ సిలో 2676, హెచ్ ఇ సిలో 229 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇందులో బాలికల కోసం 9841, బాలుర కోసం 8635 కేటాయించగా, ప్రత్యేకంగా వృత్తి విద్యా కోర్సులు – అగ్రికల్చర్ & క్రాప్ ప్రొడక్షన్ ( ACP )లో 19 సీట్లు, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ ( CGT) 11 సీట్లు, కంప్యూటర్ గ్రాఫిక్స్ & యానిమేషన్ ( CGA)లో 35 సీట్లు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (MLT) 76 సీట్లు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (MPHW)లో 92 సీట్లు, ఫిజియోథెరపీ ( PT)లో 12 సీట్లు, ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ (PSTT )లో 9 సీట్లు, టూరిజం & హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (T&H) లో 19 సీట్లు కలిపి మొత్తం 273 సీట్లు భర్తీ చేస్తామన్నారు. బీసీ గురుకుల జూనియర్ కాలేజీ ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులందరూ వెబ్ సైట్ లో తమ ఫలితాలు సరిచూసుకోవాలని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య అందించే లక్ష్యంతో పనిచేస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని అందుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని ఆయన సూచించారు.















