ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఎప్రిల్ 13,2024 :బీసీల సమస్త సమగ్ర అభివృద్ధి కోసం తీసుకువచ్చిన మండల సిఫార్సులను గత 32 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా తొక్కి పెట్టిందని, ఇకనైనా అమలు చేయకుంటే ప్రస్తుతం జరిగే లోక్సభ ఎన్నికల్లో బీసీల ఆగ్రహానికి కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా బారి మూల్యం చెల్లించక తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శనివారం హైదరాబాదులోని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో, బీసీ రిజర్వేషన్లకు ఆధ్యులు, బీసీలకు ఆరాధ్యులు… అయినటువంటి బిందేశ్వర ప్రసాద్ మండల్ 42వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల ప్రదాత బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపడం కోసం కృషి చేశారని, బిపి మండల్ త్యాగం బీసీ సమాజం ఎప్పటికీ మరువబోదని ఆయన అన్నారు. బీసీల సామాజిక స్థితిగతులపై బీపీ మండల్ నేతృత్వంలోని మండల్ కమిషన్ దేశమంతా పర్యటించి సకల బీసీల సమస్యలను మండల్ ఒక నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేసినప్పటికీ నేటికీ అవి నెరవేర్చకపోవడం చాలా అన్యాయం అన్నారు. బీసీల విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో జనాభా దామషా ప్రకారం రాజ్యాంగబద్ధమైన వాటా దక్కాలని దేశంలో వచ్చినటువంటి మండల్ కమిషన్ సిఫార్సులను గత 32 సంవత్సరాలుగా అమలు చేయకుండా తొక్కి పెట్టారని ఆయన ఆరోపించారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీలకు విద్య ఉద్యోగాల్లో ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో బీసీల వాటా అమలు చేయడానికి తక్షణమే మండల కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మండల్ కమిషన్ సిఫార్సు అమలు చేస్తామని జాతీయ పార్టీలు,అలాగే ప్రాంతీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొనాలని లేకుంటే ఈ లోక్సభ ఎన్నికల్లో బీసీల అగ్రహానికి, రాజకీయ పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. బీసీ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ మాట్లాడుతూ బీపీ మండల్ కు భారతరత్న అవార్డు ప్రకటించాలని వారి విగ్రహాన్ని పార్లమెంట్లో నెలకొల్పాలని జాతీయ ప్రాజెక్టులకు మండల పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మాదేశి రాజేందర్ మహేష్ మీరు మల్లికార్జున గౌడ్ భాస్కర్ వెంకటేష్ రాజు తదితరులు పాల్గొన్నారు
.















