1.3.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మధుశ్రీ, ఖమ్మం.
రానున్న రెండు నెలల పాటు పక్కా ప్రణాళికతో త్రాగునీటి సరఫరా చేపట్టాలని, ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి వేసవిలో త్రాగునీటి సరఫరా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు, పాఠశాలల మౌళిక వసతుల కల్పనపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నూతన కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఇట్టి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, వేసవి కాలంలో త్రాగునీటి సరఫరాపై అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకుని సన్నద్ధంగా ఉండాలని, ప్రతి రోజు త్రాగునీటి సరఫరాను పర్యవేక్షించాలని, ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. త్రాగునీటి సరఫరా నిమిత్తం మిషన్ భగీరథ ద్వారా అందుబాటులో ఉన్న వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆమె అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా త్రాగునీటి సరఫరా చేసేందుకు అవసరమైన పనులు పూర్తి చేశామని అన్నారు. త్రాగునీటి సరఫరాను పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో, గ్రామస్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాలని సిఎస్ కలెక్టర్లకు సూచించారు. మిషన్ భగీరథ వ్యవస్థ, స్థానికంగా అందుబాటులో ఉన్న నీటి వనరులతో రూపొందించిన ప్రత్యామ్నాయ వ్యవస్థలను వినియోగించుకుంటూ గ్రామస్థాయిలో రానున్న రెండు నెలలకు త్రాగునీటి సరఫరా కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎస్ సూచించారు. అత్యవసర పరిస్థితులలో స్థానికంగా ఉన్న వ్యవసాయ మోటార్లను వినియోగించుకోవాలని సిఎస్ అధికారులకు సూచించారు.
పట్టణాలలో, గ్రామాలలో త్రాగునీటి సరఫరా ఇబ్బందులు ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సప్లిమెంట్ చేయాలని సిఎస్ పేర్కొన్నారు. రానున్న రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో త్రాగునీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను వెంటనే గుర్తించి, వాటిని సత్వరం పరిష్కారం అయ్యే విధంగా చూడాలని, త్రాగునీటి సరఫరాను ప్రతిరోజు పర్యవేక్షించాలని సీఎస్ పేర్కొన్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు తగ్గి పోతున్నాయని, పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాలలో సైతం ట్యాంకర్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ట్యాంకర్ బుక్ చేసిన వెంటనే సకాలంలో సరఫరా చేసే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు జరుగుతున్న నేపథ్యంలో అవసరమైన మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రం లేని కారణంగా రైతులు ప్రైవేట్ లో తక్కువ ధరకు ధాన్యం విక్రయిస్తున్నారనే మాట రావద్దని సీఎస్ స్పష్టం చేశారు. రాబోయే 4 రోజుల్లో 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరపై కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ అంశంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 2203/- , సాధారణ రకం ధాన్యానికి 2183/- మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మన రైతుల వద్ద నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చెక్ పోస్టులను అప్రమత్తం చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సరఫరా, టెంట్లు ఏర్పాట్లు చేయాలని సిఎస్ అన్నారు. జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతులకు సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ట్యాగింగ్ చేయాలని, ప్రణాళిక బద్ధంగా కొనుగోలు కేంద్రం వద్దకు రైతు ధాన్యం తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వానాకాలం 2023-24 కు సంబంధించి సీఎంఆర్ రా రైస్ డెలివరీ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, భారత ఆహార సంస్థ నిర్దేశించిన సమయానికి రైస్ డెలివరీ చేసే విధంగా ప్రతి జిల్లాలో రైస్ మిల్లుల పనితీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, ప్రతిరోజు రైస్ మిల్లులు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిచేలా చూడాలని, సి.ఎం.ఆర్, రా రైస్ డెలివరీ పై కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని సిఎస్ పేర్కొన్నారు.
జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యం, నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకుని రావడం, అదనపు టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల మైనర్, మేజర్ మరమ్మత్తులు, తరగతి గదులకు విద్యుత్ సౌకర్యం కల్పన వంటి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు పాఠశాలలో మౌళిక వస్తువుల కల్పనకు ప్రతి మండలంలో పనుల పర్యవేక్షణకు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ నియమించాలని, క్షేత్రస్థాయిలో మరోసారి పాఠశాలలను తనిఖీ చేసి పక్కగా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎస్ అన్నారు. ప్రతి మండల స్థాయిలో పాఠశాల మౌళిక వసతుల కల్పన పై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీవో, పాఠశాల నిర్వహణ కమిటీ లో ఉన్న స్వశక్తి మహిళా సంఘాలతో వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని అన్నారు. పాఠశాలలో మౌళిక వసతుల కల్పన కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి పాఠశాలలో అవసరమైన పనులు పాఠశాలలకు పునఃప్రారంభం అయ్యే ముందే పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో వడ దెబ్బల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు నమోదు అవుతున్నాయని, ఏప్రిల్, మే నెలలో ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సిఎస్ తెలిపారు. వడదెబ్బ తగిలిన వారికి అవసరమైన ప్రథమ చికిత్స సత్వరమే అందేలా చూడాలని, క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని, ఉపాధి హామీ పనులను ఉదయం పూట నిర్వహించాలని, ఉపాధి హామీ పనుల నిర్వహణ సమయంలో కార్మికులకు అవసరమైన నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని అన్నారు. వడ గాల్పులు వీస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని, బయటకు వస్తే అవసరమైన జాగ్రత్తలు పాటించాలని, వడ గాల్పులు గురైన వ్యక్తులకు వెంటనే అవసరమైన ప్రధమ చికిత్స చేసి సమీప ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి,
ఇరిగేషన్ సి.ఇ. విద్యాసాగర్,
డిఆర్డిఓ సన్యాసయ్య, జడ్పి సి. ఇ.ఓ. వినోద్, ఎస్.ఇ.పి.ఆర్. చంద్రమౌళిశ్వరరావు, మిషనభగీరద ఎస్ఇ సాధాశివ కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల, జిల్లా పౌర సర్పరాల అధికారి చందన్ కుమార్, జిల్లా మేనేజర్ సివిల్ సప్లయ్స్ శ్రీలత, జిల్లా సహకార శాఖ అధికారి మురళీదర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్ మాలతీ, జిల్లా విద్యా శాఖధికారి సోమశేఖర శర్మ, తదితర జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.















