వైభవోపేతంగా గణేష్ శోభాయాత్ర నిర్వహణ …….. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
గణేశుని దయతో వరదల నుంచి బయటపడ్డాం
వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి
సజావుగా వినాయక నిమజ్జనం జరిగేలా నిర్వాహకులు సహకరించాలి
గణేష్ శోభాయాత్రను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి
ఈతరం భారతం రీజనల్ నెట్వర్క్ ఇంఛార్జి నలుబోల మధు శ్రీ 15.9.24 :ఖమ్మం నగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా గణేష్ శోభాయాత్ర వైభవోపేతంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా గాంధీ చౌక్ వద్ద నుండి నిర్వహించే గణేష్ శోభా యాత్రను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, ఖమ్మం పట్టణంలో శోభాయాత్ర నిర్వహణ సంతోషదాయకంగా, వైభవోపేతంగా జరగాలని, వినాయకుని నిమజ్జనం సజావుగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
వినాయకుడి దయతో, కృపతో అనుకోని వరదలు వచ్చినప్పటికీ మనం బయట పడ్డామని, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, ప్రజా ప్రతినిధులంతా క్షేత్ర స్థాయిలో ఉంటూ ప్రజల ప్రాణాలను రక్షించుకున్నామని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికి ప్రభుత్వ సహాయం అందించి, ఖమ్మం పట్టణాన్ని యధావిధిగా పునరుద్ధరించడంలో కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి, సహకరించిన ఖమ్మం ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఖమ్మం ప్రజలు అందించిన స్ఫూర్తి , సహకారం, శక్తితో ఖమ్మం పట్టణ అభివృద్ధికి విగ్నేశ్వరుడి దయతో శాయశక్తుల కృషి చేస్తానని మంత్రి తెలిపారు. వినాయక చవితి ప్రకృతికి సంబంధించిన పండుగని, భవిష్యత్తులో ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి వినాయకులకు ప్రాధాన్యత కల్పించాలని మంత్రి కోరారు. మట్టి వినాయకులను ప్రతిష్టించకపోతే నిమజ్జనానికి కూడా భవిష్యత్తులో ఉత్సవ కమిటీలు అనుమతించవద్దని, ప్రకృతి సంరక్షణలో గణేష్ ఉత్సవ కమిటీలు ముందుకు వచ్చి కఠినంగా ఉండాలని మంత్రి తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన వినాయక చవితి వేడుకలు దేశ వ్యాప్తంగా విస్తరించాయని అన్నారు.
సమాజంలోని పేదలు, మధ్యతరగతి, ఉన్నత వర్గాలకు చెందినవారు, అన్ని వర్గాల ప్రజలు చేసుకునే పండగ అని, దీనికి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశామని అన్నారు. మన జీవన విధానం సజావుగా కొనసాగడానికి ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు కల్గకుండా ఉండాలని, సమాజం భారత దేశంగా ఉండాలని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, ఈ కార్యక్రమాన్ని భక్తులు ప్రశాంతంగా సజావుగా జరుపుకోవాలని, ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగవద్దని అన్నారు. సజావుగా వినాయక నిమజ్జనం నిర్వహించడంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు అధికారులకు, పోలీసులకు సహకారం అందించాలని మంత్రి సూచించారు.
భవిష్యత్తులో గణేష్ శోభాయాత్ర మరింత ఘనంగా నిర్వహించేందుకు ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయాల్సి ఉన్న, సౌకర్యాలు కల్పించాల్సి ఉన్న ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఖమ్మం ప్రజలు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఐక్యమత్యంతో అన్ని వర్గాల ప్రజలు ఉంటూ అభివృద్ధి సాధించాలని, మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ*, ఇటీవల వచ్చిన భారీ వరదల నుంచి భగవంతుని ఆశీస్సులతో మన జిల్లా బయటపడిందని, వరదలు వచ్చిన సమయంలో బాధితులను ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో అందరం కలిసి పని చేశామని, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు క్షేత్రస్థాయిలో అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ కొనియాడారు. విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడుని ప్రజల జీవితాల్లో ఉన్న కష్టాలు, వరదల వల్ల వచ్చిన ఆపద నుంచి ప్రజలు పూర్తిస్థాయిలో బయటపడే విధంగా అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం నిమజ్జనానికి గణేషులు బయలుదేరారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు డిసిపి ప్రసాద రావు, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.















