కరీంనగర్ సెప్టెంబర్ 16 (ఈతరం భారతం);: హిందువుల పండుగలకే ఆంక్షలు, నిబంధనలు ఎందుకని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవమని… తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చినరోజు అని గుర్తుచేశారు. రజాకార్ల అరాచకాలని మనం ఎప్పుడూ మరిచిపోలేమని బండి సంజయ్ అన్నారు.బీజేపీ కేంద్ర కార్యాలయంలో బండి సంజయ్ ఈరోజు(సోమవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మరిచిపోయిందని.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భయపడి సెప్టెంబరు 17ను జరపడం లేదని విమర్శించారు. ఓవైసీ కాలేజీని హైడ్రా ఎప్పుడు కూల్చుతుందని బండి సంజయ్ ప్రశ్నించారు.తెలంగాణలో ఎవరూ అధికారంలో ఉంటే వారికి కొమ్ముకాసే పార్టీ ఎంఐఎం అని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 15లాగా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని స్పష్టం చేశారు. మొన్నటిదాక హైడ్రా….. ఇప్పుడు విగ్రహాల లొల్లి అని విమర్శలు చేశారు. ప్రజా పరిపాలన దినోత్సవం అంటే తాము ఒప్పుకోమని… తెలంగాణ విమోచన దినోత్సవం అనడానికి కాంగ్రెస్ పార్టీకి అంత భయమెందుకని బండి సంజయ్ నిలదీశారు.















