హడావుడి హంగామా లేకుండా పజ్జన్న నామినేషన్
సికింద్రాబాద్.నవంబర్.9.(ఈతరం ఇండియా న్యూస్)
డిప్యూటీ స్పీకర్, బీ.ఆర్.ఎస్. సికింద్రాబాద్ నియోజకవర్గ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ బుధవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఎటువంటి హంగు ఆర్భాటము భారీ ర్యాలీలు లేకుండా ఆయన సికింద్రాబాద్ లోని జీ హెచ్ ఎం సీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాన్ని అందించారు.
అనంతరం మీడియా తో మాట్లాడుతూ నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశామని అన్నారు. ఎన్నికల ప్రచార పాదయాత్రను నిర్వహిస్తున్నానని సికింద్రాబాద్ నియోజకవర్గం లో తనకు మంచి ఆదరణ లభిస్తోందని, తిరుగులేని ఆధిక్యతతో విజయం సాధించడం ఖాయమని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కాగా ప్రతిసారి తన పెద్దన్నతో డమ్మీ నామినేషన్ వేయించే సంప్రదాయం ఉండగా, అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి తన కుమారుడు తీగుళ్ల రామేశ్వర్ గౌడ్ తో కూడా ఒక నామినేషన్ సెట్ వేయించారు.
ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కుర్మబస్తీ రాజేందర్ యాదవ్ జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు















