ఈతరం భారతంహైద్రాబాద్ అక్టోబర్ 23
టీజీపీఎస్సీ నిర్వహించనున్న ఏఈఈ (ఆర్ అండ్ బీ) పరీక్షను వారం రోజుల పాటు వాయిదా వేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. నవంబర్ 6, 7 తేదీల్లో ఏఈఈ పరీక్షలు జరగనుండగా, నవంబర్ 6న ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ పరీక్ష కూడా ఉందని తెలిపారు. ఒకే తేదీన పరీక్షలు నిర్వహిస్తే నిరుద్యోగులు ఏదో ఒక పరీక్షకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్ లోని బీసీ భవన్‌లో ఓయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్. కృష్ణయ్య ఈ అంశంపై మాట్లాడారు. ఈ నెల 26న కూడా పీసీబీ రాష్ట్రస్థాయి పరీక్ష, ఆర్‌ఆర్‌బీ పరీక్షలు ఒకే రోజున ఉండటంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నష్టం కలగకుండా ప్రభుత్వం స్పందించి, ఏఈఈ పరీక్షను వారం రోజుల పాటు వాయిదా వేయాలని కోరారు.
ఈ సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేశ్, బీసీ సంఘం అధ్యక్షుడు సి. రాజేందర్, యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మోదీ రాందేవ్, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతీలాల్ నాయక్, అల్లంయాదయ్య,తదితరులు పాల్గొన్నారు.















