ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 23
భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా.. హైదరాబాద్‌లోని నారాయణగూడలో ‘అటల్ జీ స్మృతి సమ్మేళనం’ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధాన అతిథులుగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు , మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ , రాజ్యసభ సభ్యులు మరియు బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ , ఎమ్మెల్సీలు అంజిరెడ్డి , మల్క కొమురయ్య , తదితర నాయకులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ప్రధానంగా అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, నాయకత్వం, విలువలుపై ప్రసంగాలతో పాటు అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ సాధారణంగా ప్రజాప్రతినిధులు, నాయకులు శాసనసభలలో వాదనలు, విభేదాలు జరిపే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ, సభ వెలుపల వ్యక్తిగత శత్రుత్వాలను పక్కన పెట్టి ముందుకు సాగడం అత్యంత అవసరం. దురదృష్టవశాత్తు, గతంలో ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేను గేట్ వద్ద కొట్టిన సంఘటనలను మనం చూశాం. అలాంటి ఘటనలు ఎప్పుడూ సమర్థించదగినవి కావు.అలాగే, జయలలిత గారిని అసెంబ్లీ లోపలే దారుణంగా అవమానించిన సంఘటన మనందరికీ గుర్తుంది. ఆ దురదృష్టకరమైన ఘటన ద్రౌపది వస్త్రాపహరణం దృశ్యాన్ని తలపించింది. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యంలో జరగకూడదు.ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, దాన్ని ముందుకు నడిపించిన విషయంలో మనకు ఆదర్శంగా తీసుకోవాల్సిన నాయకుడు భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి అని అన్నారు.నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌన్సిల్‌లో, ముఖ్యమంత్రి గారితో సహా, “ప్రతిదీ ఫ్రీ” అనే విధానం ప్రమాదకరమని స్పష్టం చేశాను. ఈరోజు చాలా ప్రభుత్వాల వద్ద ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేవు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితులు వస్తున్నాయి. కొందరు పెన్షనర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, మరికొందరు రోడ్లపైకి వచ్చి భిక్ష అడిగే స్థితి ఏర్పడుతోంది. ఇది చాలా బాధాకరం. అందుకే ప్రభుత్వాలు ఆదాయం – ఖర్చు మధ్య సమతుల్యత పాటించాలి. రెవెన్యూ, ఎక్స్పెండిచర్ మధ్య సమతుల్యత అవసరం. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్‌తో పాటు డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ కూడా సమానంగా అమలు చేయాలి. ఈ సమతుల్యతను సాధించిన నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి . అందుకే వాజ్ పేయి గారి జయంతిని ‘గుడ్ గవర్నెన్స్ డే’గా దేశం మొత్తం జరుపుకుంటోంది.ఈరోజు మనం రాజకీయాల్లో భాషా ప్రయోగం ఎంత దూరం వెళ్ళిందో గమనించాలి. వ్యక్తిగత విమర్శలను మించి, విధానపరమైన విమర్శలు, సైద్ధాంతిక చర్చలను కొంతమంది మర్చిపోయారు. ఏదైనా వాదనలతో మాట్లాడితే కూడా బూతుల వంటి వ్యాఖ్యలు చేస్తున్న ఘటనలను చూస్తున్నాం.అందుకే ప్రజాస్వామ్య పద్ధతిలో నిజమైన డెబేట్, చర్చలు, ప్రజాస్వామ్య విలువలను గౌరవించడం తప్పనిసరి అని అన్నారు.కొందరు పార్టీ సిద్ధాంతాలను విమర్శించవచ్చు, విధానాలను ప్రశ్నించవచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. అటల్ బిహారీ వాజ్‌పేయి గారి స్ఫూర్తి మనకు ఇదే నేర్పిస్తుంది. ఆయన ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా, వ్యక్తిగత దాడులకు పాల్పడకుండా, విధానాలపై మాత్రమే చర్చించేవారు.తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇలాంటి కొత్త పరంపరను కొనసాగించాలి. వ్యక్తిగత దాడుల ద్వారా రాజకీయాలు చేయడం మంచిది కాదు. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు రెండూ విధానపరమైన విమర్శలను స్వీకరించి, వ్యక్తిగత దాడులను నివారించాలన్నారు.















