EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భారత ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం లేఖ

ఈ తరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 14

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాల ద్వారానే నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశం కావడంతో బాధ్యతాయుతంగా ఈ లేఖ రాసినట్లు తెలిపారు. ప్రస్తుతం మహిళా రిజర్వేషన్, పునర్విభజన, లోక్‌సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను ఒకదానితో ఒకటి ముడిపెట్టి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, అవి పూర్తిగా వేర్వేరు విషయాలని స్పష్టం చేశారు.మహిళల రిజర్వేషన్ బిల్లుకు భారత జాతీయ కాంగ్రెస్ పూర్తిగా మద్దతు ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లలోనే 33 శాతం మహిళల రిజర్వేషన్‌ను యథాతథంగా వెంటనే అమలు చేయాలని సూచించారు. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా అమలు చేయాలని కోరారు. మహిళల రాజకీయ సాధికారత కేవలం చట్టపరమైన మార్పుకాదని, అది ప్రజాస్వామ్యానికి ఒక నైతిక అవసరమని పేర్కొన్నారు. పునర్విభజనకు సంబంధించి గతంలో కూడా సీట్ల సంఖ్య పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మారుస్తూ డీలిమిటేషన్ నిర్వహించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అలాంటి ప్రక్రియను చేపట్టవచ్చని తెలిపారు. లోక్‌సభ సీట్లను 850కు పెంచే ప్రతిపాదన అసలైన వివాదాస్పద అంశమని పేర్కొన్నారు. ప్రస్తుత సీట్లను పెంచి వాటిని కేటాయించే ఆలోచనపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రిజర్వేషన్‌కు పూర్తి మద్దతు ఇవ్వటంతో పాటు, సీట్ల సంఖ్య పెంపు లేకుండా డీలిమిటేషన్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top