ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 5:
హైదరాబాద్ 80 గాంధీనగర్ లో 2000 సంవత్సరంలో స్థాపించబడి, గత 25 సంవత్సరములుగా నిరంతరముగా వృద్ధులకు, బాలలకు, మహిళలకు వివిధ సామాజిక సేవలు అందజేస్తున్న శ్రీ పరాశరి మహిళా సేవా సంస్థ వారు తమ రజతోత్సవ ఉత్సవాలు శుక్రవారం సాయంత్రం చిక్కడపల్లి త్యాగరాజ గాన సభలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా జరుపుకున్నారు. తమ సంస్థ 25 సంవత్సరములు పూర్తి చేసి రజితోత్సవాలు జరుపుకోవడం తమకెంతో ఆనందదాయకమని సంస్థ అధ్యక్షురాలు రామలక్ష్మి మోచర్ల తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో కృషి చేసిన 25 మంది ఉధ్ధండులను గౌరవించడం తమకు మరింత ఆనందాన్ని కలుగజేసింది అని ఆమె తెలిపారు. కార్యక్రమానికి అతిధులుగా శలాక రఘునాధ శర్మ, ఎస్కే జయచంద్ర ఐపీఎస్, డాక్టర్ బిక్కి కృష్ణ, డాక్టర్ వోలేటి పార్వతీశం, డాక్టర్ ముక్తేవి భారతి, డాక్టర్ కళా జనార్ధన్ మూర్తి, డాక్టర్ జల్దీ విద్యాధర్, డాక్టర్ జ్యోత్నారావు, ఆచార్య త్రిమూర్తుల గౌరీ శంకర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.కార్యక్రమంలో భాగంగా వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు ను అతిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బంగారు తాతారావు మాట్లాడుతూ తాము, తమ సహచరులు 2017 లో స్థాపించిన వెస్సో ట్రస్ట్ రెండు తెలుగు రాష్ట్రాలలో పేదవారికి వివిధ సామాజిక సేవలు అందచేస్తూ, ఇప్పటికి ఎనిమిదిన్నర సంవత్సరాలు పూర్తి చేసుకుని, త్వరలో కోటి రూపాయల టర్నోవర్ అధిగమించ బోతున్న శుభ తరుణంలో, తమ సామాజిక సేవలను గుర్తించి, గౌరవించిన పరాశరి మహిళా సేవా సంస్థ కమిటీ వారికి మరియు సంస్థ అధ్యక్షురాలు రామలక్ష్మి మోచర్ల గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.















