EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సంక్రాంతి పండుగకు 6,431 ప్రత్యేక బస్సులు

ఈతరం భారతం హైదరాబాద్‌ జనవరి 7

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. పండుగకు 6,431 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్రణాళికను సిద్ధం చేసింది.ఈ నెల 18, 19 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయినపల్లి , గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తుంది.సంక్రాంతి పండుగకు నడిపే ప్రత్యేక బస్సులకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో ప్రకారం 1.5 వరకు టికెట్ ధరలను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయని సంస్థ వెల్లడించింది. ఈ నెల 9, 10, 12,13 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే సవరించిన ఛార్జీలు అమల్లో ఉంటాయని, స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే అమల్లో ఉంటాయని వెల్లడించింది.రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని వివరించింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ను www.tgsrtcbus.in వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించాలని సూచించింది.

 

 

Related News

Select the Topic
Scroll to Top