ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 2
హైదరాబాద్ శివారు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచి పొగమంచు కమ్మేయడంతో రోడ్లు, భవనాలు ఏమీ కనిపించకుండా ఉంది. దీంతో నగర శివారు ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం నాగార్జునసాగర్ హైవే, మేడ్చల్, తూంకుంట, శామీర్పేట, ఆదిబట్ల, గండిపేట, మోకిల, పటాన్చెరు, వికారాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్పోర్టు మార్గాల్లో జీరో విజిబిలిటీ ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రహదారిపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో రోడ్డు పక్కన వాహనాలను నిలిపివేసుకున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై శంషాబాద్ నుంచి పాలమాకుల వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పొగమంచు కమ్ముకోవడంతో రహదారి పక్కకు వాహనాలను నిలిపివేశారు. పొగమంచు కారణంగా ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై పొగమంచు దట్టంగా కమ్ముకుంది. అబ్దుల్లాపూర్మెట్ వద్ద పది అడుగుల దూరంలోని వాహనాలు కూడా కనిపించనంతగా పొగమంచు కుమ్ముకుంది. దీంతో ముందు వెళ్తున్న వాహనాలు కనిపించడం లేదు. విజిబిలిటీ లేకపోవడంతో లైట్ల వెలుతురులో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.















