ఈతరం భారతం ఖమ్మం, డిసెంబర్ -10 :
గ్రామ పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేస్తున్న వెబ్ క్యాస్టింగ్ మానిటరింగ్ సెల్ ను బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు 7 మండలాలకు సంబంధించి జరుగుతున్నాయని, వీటిలో మొత్తం 360 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, 1006 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి క్రిటికల్ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టామని తెలిపారు.క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళీ పర్యవేక్షించేందుకు మండలానికి ఒకటి చొప్పున కలెక్టరేట్ లో మానిటరింగ్ సెల్ లో 7 స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటీ విడత పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ తో పాటు సాధారణ పరిశీలకులు ఇతర ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలించి, సజావు ఎన్నికల నిర్వహణకు పర్యవేక్షణ చేస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలంలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో చివరిసారి క్రాస్ చెక్ చేసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాసరావు, ఈడిఎం దుర్గాప్రసాద్, టెక్నికల్ టీం సభ్యులు హనుమా చారి, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.















