ఈతరం భారతం ఖమ్మం, జనవరి 05.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దేశ ప్రధానిపై కూనంనేని చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి, విదేశీ సిద్ధాంత బానిసత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. భారతీయతను, భారత రాజ్యాంగాన్ని గౌరవించడం చేతకాని కమ్యూనిస్టులు, ఇంకా విదేశీ భావజాలంతోనే బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. తాను గాంధీ భక్తుడిని, సోనియా గాంధీ భక్తుడిని, రాహుల్ గాంధీ భక్తుడిని అని కూనంనేని బహిరంగంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఒక ఎమ్మెల్యేగా ఉండి, సాటి రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రధానిని విమర్శిస్తూ, పక్క పార్టీ నేతలకు సొత్తుగా మారి వ్యక్తి భజన చేయడం అప్రజాస్వామికమని నెల్లూరి ధ్వజమెత్తారు. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ప్రధాని మోదీకి కూనంనేని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ – రోజ్ గార్ ఔర్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)’ చట్టంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని నెల్లూరి విమర్శించారు. కేవలం పేరు మార్చారని గగ్గోలు పెడుతున్న సీపీఐ, కాంగ్రెస్ నేతలకు అందులోని విప్లవాత్మక మార్పులు కనిపించడం లేదని ఆక్షేపించారు. గతంలో ఉన్న 100 రోజుల పనిదినాలను ఈ కొత్త చట్టం ద్వారా 125 రోజులకు పెంచి పేదల ఆదాయానికి మోదీ గ్యారెంటీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు ఢిల్లీలో తయారవుతున్నాయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, కానీ వాస్తవానికి గ్రామ పంచాయతీలు, గ్రామ సభలే తమ గ్రామానికి కావాల్సిన పనులను నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛను ఈ చట్టం కల్పించిందని స్పష్టం చేశారు.
వ్యవసాయ సీజన్లో కూలీల కొరత వల్ల రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని కేంద్రం గుర్తించిందని, అందుకే విత్తులు నాటే సమయం లేదా కోతల సమయంలో సంవత్సరంలో 60 రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించిందని నెల్లూరి వివరించారు. దీనివల్ల వ్యవసాయ పనులకు ఆటంకం కలగదని, రైతులు మరియు కూలీల మధ్య సమతుల్యత ఉంటుందని తెలిపారు. అలాగే ఉపాధి హామీ పథకానికి వెన్నెముకగా నిలిచే ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి శిక్షణ మరియు గౌరవ వేతనం కోసం కేటాయించే నిర్వహణ వ్యయాన్ని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచినట్లు వెల్లడించారు. తద్వారా వారికి సకాలంలో వేతనాలు అందుతాయని, పనిలో నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు.
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని నెల్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత సమయంలో పని కల్పించకపోతే నిరుద్యోగ భత్యం, వేతనాలు ఆలస్యమైతే పరిహారం చెల్లించే నిబంధనలను బలోపేతం చేసిన విషయం కూనంనేని తెలుసుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు మానుకోకపోతే, బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ఆరోపణలను తిప్పికొడతారని, జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, నాయకులు సుదర్శన్ మిశ్రా, బండారు నరేష్, వీరవల్లి రాజేష్ , నెల్లూరు బెనర్జీ, రవి రాథోడ్, రవి గౌడ్, గడిల నరేష్ ,కోట మూర్తి, అల్లిక అంజయ్య, మనీ, వంశీ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.















