ఈతరం భారతం ఏప్రిల్ 25 ఖమ్మం :
రోడ్డు భద్రత సామాజిక బాధ్యతగా గుర్తించాలని అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు భద్రతపై విద్యార్థులకు అరైవ్ ఆలైవ్ అవగాహన కార్యక్రమం నగరంలోని SR జూనియర్ కాలేజ్ నిర్వహించారు. ఈ సందర్బంగా అడిషనల్ డీజీ మాట్లాడుతూ…రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతని, ఇది ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడుతుందన్నారు. ద్విచక్ర వాహనాలపై హెల్మెట్, కార్లలో సీట్ బెల్ట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగాన్ని నియంత్రించడం వంటి నిబంధనలు పాటించడం ద్వారా సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందన్నారు.
యుద్ధాలలో, నేరాలల్లో మరణించే వారి కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారనేది వాస్తవమని, ప్రతి సంవత్సరం సుమారు 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతుండగా, ప్రతి నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతోందని, ప్రతి మూడు నిముషాలకు ఒకరు చనిపోతున్నారని పేర్కొన్నారు. మృతులలో అత్యధికులు 18-45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఎక్కువ వున్నారని తెలిపారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యం, రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు.
విదేశాల్లో కఠినమైన చట్టాలు, భారీ జరిమానాలు ఉండటంతో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారని, కానీ ఇండియాలోకి రాగానే అవే నిబంధనలను నిర్లక్ష్యం చేస్తారని, ఈ అలసత్వం వల్ల ఏటా భారీగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా పిల్లలకు రోల్ మోడల్ (ఆదర్శం)గా నిలవాలని, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం వంటివి నిత్యజీవితంలో పాటిస్తూ, పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలలో, తల్లిదండ్రులు ఇంట్లో భద్రతా అలవాట్లను ప్రోత్సహించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని సూచించారు. అవగాహన కార్యక్రమంలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని కుటుంబ సభ్యులకు, బంధువులకు అవగాహన కల్పించాలన్నారు.
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ..చిన్న నిర్లక్ష్యపు చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు.రోడ్డు ప్రమాదం వల్ల కుటుంబంలోని వ్యక్తిని కోల్పోవడం కుటుంబానికి తీరని లోటని, ఇది తీవ్రమైన దుఃఖం, మానసిక వేదన, నిత్యజీవితంలో పెను మార్పులను కలిగిస్తుందని, మానసిక ఒత్తిడి, ఆర్థిక కష్టాలు ఎదురవుతాయని గుర్తించాలన్నారు. బయటకు వెళ్లిన వ్యక్తులు క్షేమంగా ఇంటికి చేరుకోవడం కోసం హెల్మెట్, సిట్ బెల్ట్ ధరించడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని కుటుంబ సభ్యులు చెప్పాలన్నారు.
విద్యార్థులు రోడ్డు భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తామని, హెల్మెట్/సీటు బెల్ట్ ధరిస్తామని, మద్యం తాగి వాహనం నడపమని ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా &ఆర్డర్ ప్రసాద్ రావు, ఆర్టివో రాజశేఖర్, ఏసీపీలు రమణమూర్తి, మహేష్, శ్రీనివాసులు, సర్వర్, సిఐలు భానుప్రకాష్, కరుణాకర్,బాలకృష్ణ, మోహన్ బాబు,రాజిరెడ్డి, సత్యనారాయణ, అప్పలనాయుడు పాల్గొన్నారు.















