ఈతరం భారతం జనవరి 5
యాదాద్రి భువనగిరి : తెలుగు సాహిత్య రంగంలో ఐదు దశాబ్దాలుగా లెక్కల మల్లారెడ్డి చేసిన కృషి మహోన్నతమైందని సాహిత్య రంగ ప్రముఖులు కొనియాడారు. ప్రముఖ కవి, రచయిత, నవలా నాటకకర్త లెక్కల మల్లారెడ్డి రచించిన కనువిప్పు, శంఖారావం దృశ్యకావ్యాల ఆవిష్కరణ భువనగిరి పెన్షనర్స్ భవనంలో జరిగింది. ప్రఖ్యాత సాహితీవేత్త, విశ్రాంత ప్రధాన చార్యులు డాక్టర్ జనువాడ రామస్వామి ముఖ్యఅతిథిగా హాజరై గ్రంధావిష్కరణ జరిపి సమీక్షాత్మకంగా ప్రసంగించారు. భిన్న ప్రక్రియలలో ఐదు దశాబ్దాలకు పైగా రచనలు చేసి లబ్ద ప్రతిష్టులైన మల్లారెడ్డి వరకట్న నిర్మూలన, దేశభక్తి ప్రబోధం అన్న వస్తువులతో దృశ్య కావ్యాలను పాఠకులకు అందించడం అభినందనీయమని చెప్పారు. నిరంతర చైతన్యంతో, అకుంఠిత సామాజిక స్పృహతో రచనలు చేస్తూ ఇప్పటి తరానికి మల్లారెడ్డి సాహిత్య మార్గదర్శనం చేయడం హర్షణీయమని తెలిపారు. మల్లారెడ్డి రచించిన నాటకాలు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో, పాఠశాలల్లో విద్యార్థులచే పలుమార్లు ప్రదర్శితమయ్యాయని, ఆయన రచనలకు సాహిత్య సాంస్కృతిక సంస్థల గుర్తింపు, ప్రజాదరణ దక్కిందని చెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా విద్యారంగంలో ఉపాధ్యాయునిగా పనిచేసి ఎంతోమంది ఉత్తమ విద్యార్థులను సమాజానికి అందించిన గురువు మల్లారెడ్డి అని ప్రశంసించారు. గత సంవత్సరం నా పల్లె చిన్నబోయింది అన్న మల్లారెడ్డి రాసిన గీతం యూట్యూబ్ ద్వారా విశేష ప్రజాదరణ ఆయనకు ఎంతో ఖ్యాతిని తీసుకువచ్చిందని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య మాట్లాడుతూ ఐదు దశాబ్దాలుగా భిన్నమైన ప్రక్రియలలో విభిన్నమైన వస్తువులను ఎంపిక చేసుకొని తనదైన ముద్రతో సాహిత్య రంగంలో పురోగమించి విశిష్ట గ్రంథాలను రచించడం మల్లారెడ్డి సృజనశక్తికి సాక్ష్యమని చెప్పారు. మల్లారెడ్డి రచించిన నాటకాలను ఆయన వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులే నటులుగా మారి ప్రదర్శించి ఆ నాటక ప్రాధాన్యతను ఈ తరానికి తెలియజెప్పడం ఎంతో అభినందనీయమని అన్నారు. మల్లారెడ్డి సాహిత్య కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన తెలిపారు. జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి బండారు జయశ్రీ, కవి శెట్టి బాలయ్య యాదవ్, జిల్లా పెన్షనర్ సంఘం అధ్యక్షులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, డాక్టర్ వల్లాల అమరేందర్, కొక్కలకొండ నిమ్మయ్య, మెరుగు దేవరాజు, సాహితీ వేత్త,అధ్యాపకులు డాక్టర్ బి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. సాహితీవేత్తలు, పెన్షనర్లు, పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా మల్లారెడ్డిని ఘనంగా సత్కరించి అభినందనలు అందించారు.















