అన్నింటికీ అతీతమైన అతి గొప్ప పదం శ్రమ. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదన్నది నిజమే. మనిషి తన మూలాన్ని శ్రమ పునాదిపైనే కట్టుకున్నాడు. ఏ జీవనానికైనా శ్రమ ఒక అపూర్వ చరిత్రగా మారుతుంది. అవిశ్రాంత కార్యకలాపం, నిజాయితీకి దర్పణం, ఐక్యతాసాధనకు ప్రతిరూపం శ్రమే. రాజ్యాధికారం సృష్టించిన వికృత కల్పనల ప్రకంపనలు శ్రమను అణగదొక్కేందుకు చేయని ప్రయత్నమే లేదు. వేలయేళ్ల ఆధిపత్యం శ్రమను, శ్రమవార సత్వాన్ని విభజించి పాలిస్తుంటే శ్రమీయుల అంతరంగ వేదన పోరాటపు అగ్నిశిఖలను రగిలిస్తూనే ఉంది. శ్రమ పునాదిపైనే సంస్కృతి, నాగరికత, భాషలు, కళలు,సమస్త సంపద నిర్మింపబడతాయి. ప్రపంచం అంగీకరించిన శాశ్వత సత్యం ఇదే. ఆదిమానవుల నుండి ఆధునికుల దాకా శ్రమ చిందించిన చెమట పరిమళాల పునాదుల ఎరకను సాహిత్యం గొప్పగా ప్రతిబింబిస్తూనే ఉంది.
శ్రమకు ఊతమైన పాటల ఊపిరిని భావాల ఆయువుగా మార్చుకొని చారిత్రక కథా కావ్యాలాపనగా శ్రమ కావ్యాన్ని ప్రఖ్యాత సినీ గేయ కవి డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ ప్రతిభావైవిధ్యతతను చూపుతూ వచనంలో రాశారు. సన్నివేశంలో, లోతైన ఆలోచన, అనుభవం వెల్లివిరిస్తే మేధోశక్తి చోదక శక్తిగా మారి ఆకృతి తొడిగిన పురోగతికి పర్యవసానంగా శ్రమకావ్యం వెలువడింది. ఊహాజనిత వాస్తవం , వాస్తవాధార చారిత్రకంగా ఈ కావ్యరూప ప్రతిపాదన జరిగింది. శ్రమి, శ్రముడు అన్న జంట చుట్టూ జరిగిన శ్రమైక అల్లిక ఇది. శ్రమే మూలం అన్న సత్యానికి ఆ రెండుపాత్రలు ప్రతీకలయ్యాయి. చరిత్ర పరంపరలో గొప్ప అద్భుతం శ్రమే. శ్రమీశ్రముల మూలాలపై మలిచిందే ఈ కావ్యం. ప్రకృతి, ప్రపంచం మనిషిని అర్థం చేసుకోవడంలోనే శ్రమ రూపం బోధపడుతుంది. మనిషి తయారు చేసుకున్న పనిముట్లు, ఆయుధాలే కాకుండా మనుషుల మధ్య అదృశ్య శక్తిగా పుట్టిన మాట, ఆట, పాటలతో పాటు శారీరక మేధోశ్రమ దాగి ఉందని చెప్పారు. కావ్య అంకురాలు ఏమిటో తెలిపారు. పరికరాలతో జ్ఞానాన్ని సృష్టించి అభివృద్ధి పరిచిన తెలివి కష్టజీవిది అన్న సత్యాన్ని వివరించారు. ఊహలకు అనేక యదార్థాలను ఆధారంగా చెప్పారు. శారీరక, మేధోశ్రమ జీవిగా మనిషిని చూపించారు. శ్రమ ప్రయాణపు సువిశాలతను ప్రపంచానికి పరిచయం చేశారు. శ్రామికుల శ్రమతో ఉత్పత్తి అయిన సర్వ పరికరాలు, కళలు పరాయీకరణ కావడాన్ని నిరసిస్తూ శ్రమైక జనతా సిద్ధిని లక్ష్యంగా ఆవిష్కరించారు.
శ్రమైక జగతి/ పురోగమనాగమనాన్ని/ శ్రమఆది/ శ్రమమధ్య/ శ్రమ ఆదిమధ్యాంతాతీతముగా/ దిగ్ధిగంతముల నాక్రమించిన/ శ‌్రమ విక్రమాకృతిని నేను కీర్తిస్తున్నాను అంటారు. శ్రమీశ్రములు జంట ద్వారా శ్రమే అన్ని వస్తువులను, కళలను సృష్టించిందని నిర్ధారించడమే కాకుండా భౌతికవాద వైజ్ఞానిక జ్ఞానాన్ని అందించారు. ఏకైక/ శ్రమైక/ మతాన్ని నేను ప్రకటిస్తున్నాను అంటూ శ్రమయిక ప్రపంచాన్ని ఆవిష్కరించారు. పోచమ్మ పోతరాజు సర్వాయి పాపన్న/ బీరప్ప జాంబవంతుల చారిత్రక కథాలాపనలకు ముందు/ చిందులు శారదాకారులు బీర్ల కథకులు వివిధ/ కులవృత్తి జానపదాల చరిత్ర/ మూల కథల నేరుకుని గొంతు/ సవరించుకున్నట్టు శ్రమకావ్య చారిత్రక కథాలాపన సాగుతుంది. మానవ ప్రస్థానపు పరిణామ శీలతతో అలౌకికమైన ఆలోచనాధోరణి వ్యక్తమైంది. ప్రయత్నం, కృషి, అన్వేషణ, ఆలోచన, పరిశోధన, పరిశీలన, స్పందన, ప్రతిస్పందన, అవలోకన, ఆచరణ వంటి అంశాల వెనుక ఉన్న శక్తి శ్రమేనని నిర్ధారణగా చెప్పారు కవి. సృష్టిలో జరిగే ప్రతి పరిణామానికి శ్రమే ప్రేరణ శక్తిగా మారిందన్న నిర్దేశాన్ని అందించారు. మానవ ప్రస్థానం ప్రత్యేకమైన దృష్టి కోణంలో ఆవిష్కరణ జరిగి కవి స్వాప్నికతను అందుకు తగిన యదార్థతను ప్రకటించింది. నాలుక రుచికీ, ముక్కు వాసనకూ/ ముఖ కండరాల చైతన్యం శ్రమే అన్నారు కవి. అశృగ్రంథులు అవతరించడానికి/ ముఖంపడ్డ యాతనే శ్రమ అని వివరించారు. మార్మిక ధోరణిలో రచన కొనసాగింది. అనితర సాధ్యమైన జిజ్ఞాస కనిపిస్తుంది. తొలి మానవుని ఉనికిని చెబుతూ పెద్దబండతో/ మంచు ఎలుగును/ చుంచు ఎలుకను వేటాడే/ వికసించని తొలి మానవ మేధస్సు అది అంటారు. మానవుడు రాతిని ఆయుధంగా మార్చుకున్న క్రమంలో మబ్బుమబ్బు కరుసుకుంటే మింటిలోన మెరుపు నిప్పు/ రాయిరాయి ఒరుసుకుంటే రవ్వల రూపంలో నిప్పు అన్నారు. మొదటి ఆయుధాన్ని ప్రకృతిలోంచే శ్రముడు సృష్టించుకున్నాడని చెబుతూ ఆలోచనల అమ్ములపొదకు/ పాదు పురుడు పోసుకుందని చెప్పారు. నాగరికతను సాధించిన మనిషికి గూడు కావాలి/ కడుపులో దాచుకునే నిలవనీడ కావాలని భావించారు.
క్షణక్షణం సృష్టిలో జరుగుతున్న పరిణామాల గుర్తింపు శ్రమ కావ్యంలో అడుగడుగునా కనిపిస్తుంది. అలౌకికమైన ఆలోచనా ధోరణి వ్యక్తమైనా స్పష్టమైన ప్రణాళికతో కూడిన కవి చూపు ముందుకు నడిపిస్తుంది. మార్మిక ధోరణిని పాటిస్తూనే కలంతో అలవోకగా దృశ్యాలను చెక్కారు. శ్రవణనాడిని/ శృతి చేసేందుకు ముఖం చేసే ప్రయత్నం కూడా శ్రమే అన్నారు కవి ముఖకండరాల చైతన్యాన్ని శ్రమకు సంకేతం చేశారు. కథావిష్కరణకు సిద్ధం చేసిన శ్రముడు, శ్రమి పాత్రల నేపథ్యంలో నాల్గుకాళ్ల శ్రమనంతా వెనుగాళ్లకు మునుగాళ్లకు విరామ ప్రకటించి అంటూ తొలి మానవుని ఉనికి, వేట, నిప్పు వంటి అంశాలను కవి ప్రస్తావించారు. శ్రమి ఆలోచన, శ్రముడి ప్రశంస, ప్రకృతిలోంచే మొదటి ఆయుధంగా వెదురును బాణంగా మలచుకోవడం, చర్మాన్ని తాకినప్పుడు పుట్టిన శబ్ధం విని డప్పును తయారు చేసుకోవడం, ధ్వన్యనుకరణ, గుర్రం పరుగునే వేగానికి, శక్తికి సంకేతంగా చూపించారు. పొట్ట కింద గుడ్డును పిట్ట పొదవు కోవడం ఎలాగో మనిషి తలదాచుకునేందుకు నిలవనీడగా గూడును కట్టుకున్నాడని తెలిపారు. శత్రువును ఎదుర్కునేందుకు భయపు గాయం చేయడం నేర్చుకోవడం, చెట్టును తనకు తిండి పెట్టే పెద్ద దిక్కుగా గుర్తుపట్టడం, పండు తినగా మిగిలిన గింజ భూమిలో నాటినాక మళ్లీ మొలకగా పుట్టడం గురించి కవి చెప్పారు. భూమిని దున్నడానికి నాగలిని, నడక పరుగుగా మార్చుకోవడానికి చక్రాన్ని శ్రమి, శ్రములు సాధించారని తెలిపారు. ఆహారాన్ని నిలువ ఉంచుకోవడం కోసం మేధోయజ్ఞ గుండంలో/ మరిగే ఆలోచనల గిన్నెలోంచి/ పొంగి వొలికిందొక వెలుగు అంటూ కుమ్మరి చక్రాన్ని చూపి అది సృష్టించిన ముంత, కూజా, అటిక, గురిగి, కంచుడు, పొంత వంటి వాటిని గుర్తు చేస్తారు. శ్రమిశ్రముల జీవితం చైతన్యతను సంతరించుకుందని అంటారు. వెన్నెలను, బంగారాన్ని/ తోడు బెడితే పేరుకున్న/ గడ్డకట్టిన మీగడ పెరుగు శ్రమి అని చెప్పారు. ఆదిమ మానవుడి మనస్సు ఆనాడు చేసిన ఆలోచనలను 21వ శతాబ్దంలోకి ఒంపి అందించిన సృజన పనితనం కవిది. మొట్టమొదటి చెప్పు తయారీ కోసం చేసిన ప్రయత్నం తరువాత పాదుకలకు మాతృకలుగా మారాయని చెబుతారు. మృగ చర్మాలను కట్టుకొని తిరిగే ఆది మానవునిడికి వస్త్రాల నేత అలోచనను చెప్పిన గురువు సాలీడు అంటారు. ఉపాధి, ఉనికి, ఆనందం, పరవశం, ఉత్తేజం, అంతర్ముఖం వంటి అనేక అంశాలు శ్రముడి నేపథ్యంగా చెప్పారు. శ్రమి చింతపిక్కల మంట వెలుగుల్లో ఆనంద పరవశురాలైతే నాట్యం రూపుదిద్దుకుంటారు. జీవించే ప్రయత్నాన్ని కళగా చూపించారు. తన ఆనందాన్ని పంచుకోవడం, ఉమ్మడిగా ఉండడం మనిషిపరంగా చూపించారు. ఆహార అవసరాలకు ఇతరులను హింసకు, దోపిడీకి గురి చేసే తీరు తొలగిపోవడంలో వెలుగును చూపించి చీకటికి అదే అర్థమని వివరిస్తారు. దెబ్బ తగిలితే అశృగంధి పుట్టిందని అంటూ ఆనందం పాటగా, మాటగా రూపుదిద్దుకుందని అంటారు. మనిషి తొలిమాట అన్వేషణకు దారులు తీసి శబ్ధశక్తి, యుక్తిని పెంచిందని తెలిపారు. దరువు, లయలతో శబ్ద శ్రమ యజ్ఞానికి సంగీత విన్యాసాన్ని చూపించి క్రమంగా ఎదుగుతున్న జీవితపు ఛాయలను ఆవిష్కరింపజేశారు. చిత్రకళ, శిల్పకళ మానవునిలో తాండవించిన తీరులను చెబుతూ బొంతపురుగు రెక్కలు వచ్చి సీతాకోకచిలుక అయినట్టుగా రాతి కార్మికుడు శిల్పిగా ఎదగడాన్ని చూపారు. జీవనది పురిటి గది అన్నది ఈ కావ్యానికి పతాక శిఖరం. నిత్యం మోసే నేలతల్లి ఎలాగో కడుపులో బిడ్డను మోసే తల్లి గొప్పతనాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. సగం నీళ్లలో ప్రసవించింది శ్రమి/ బిడ్డ నీళ్లలోకి జారింది/ తల్లిపేగుతో ముడిపడ్డ/ నీళ్లలో బతుకమ్మలా తేలినట్టాయే అంటూ అప్పుడే కన్నువిప్పిన శిశువుకు కొత్త లోకపు బతుకును పరిచయం చేశారు. బిడ్డను కన్న కష్టం భార్యది, పురుషుడిది పెత్తనం అంటూ అక్కడా కూడా పురుషాధిక్యత పురుడు పోసుకోవడాన్ని కవి గుర్తు చేస్తారు. ఊహాత్మక రూపాల్లో వివిధ దశల్ని ఒక అనుభూతి సంద్రంగా మలచి కవి ఆవిష్కరించారు. భూ ప్రపంచం శ్రమ ఇరుసుగా/ శ్రమ కందెనగా తిరుగుతుందని ప్రకటించారు. గొప్ప విశ్లేషణకు దారితీసే ఎన్నో పార్శ్వాల విన్యాసం ఈ కావ్యంలో దృశ్యాతీతమైంది. శ్రమ విరాట్ స్వరూపానికి ఇది కవి అంతరాళపు మహాక్షరాభిషేకం.
సమీక్ష : డా. తిరునగరి శ్రీనివాస్ 9441464764















