జూరాల ప్రియదర్శిని డ్యామ్‌కు పోటెత్తిన వరద..
17 గేట్లు ఎత్తిన అధికారులు..
హైదరాబాద్ జూలై 21 (ఈతరం భారతం);తెలంగాణలో రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో అటు కృష్ణా.. ఇటు గోదావరి నదుల్లో వరద పోటెత్తుతున్నది. ఎగువన కర్ణాటకలో పడుతున్న భారీ వర్షాలకు గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శిని డ్యామ్‌కు వరద పెరిగింది. ప్రస్తుతం జలాశయానికి 92వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 17 గేట్లను ఎత్తివేసి దిగువకు 67వేల క్యూసెక్కుల వరదను వదులుతున్నారు.మరో 33వేల క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వెళ్తున్నది. జారాల డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. ప్రస్తుతంనీటిమట్టం 317.17 మీటర్లకు చేరుకున్నది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 7.04 టీఎంసీలు ఉన్నది. జూరాల నుంచి దాదాపు లక్ష క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి చేరుతున్నది. ప్రస్తుతం వర్షాలు కొనసాగితే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు శ్రీరాంసాగర్ జలాశయానికి సైతం ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నది














