కళాకృతి నాట్యాలయ దశమ వార్షికోత్సవ వేడుకలు నాట్య కచేరీలు రసహృదయాలను మీటాయి. భరతనాట్య ప్రదర్శనలు బాలల ప్రతిభకు గీటురాయిగా నిలిచాయి. నగరానికి చెందిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి కళాకృతి నాట్యాలయ వ్యవస్థాపక సంచాలకురాలు భారతీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంస్థ దశమ వార్షికోత్సవం రవీంద్ర భారతి ఆడిటోరియంలో అతిరథ మహారథుల సమక్షంలో వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆదాయపన్నుల శాఖ కమిషనర్ జీవన్‌లాల్ లవిడియా, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ , దేశం నలుచెరగుల నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి నృత్యోత్సవాల సంచాలకులు సాయి వెంకటేష్(కర్ణాటక), బత్తిన రంగ విక్రమ్ కుమార్(ఆంధ్రప్రదేశ్), కాశ్మీరా త్రివేది,(మహారాష్ట్ర), జగబంధు జెనా (ఒడిషా) అతిథులుగా హాజరై జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫక్తు భరతనాట్య సంప్రదాయాన్ని పాటిస్తూ హిందోళరాగంలో పుష్పాంజలి తొలి అంశం చిన్నారుల నాట్య ప్రావీణ్యానికి మెచ్చుతునకగా చెప్పుకోవాలి. హిందోళరాగం/ఆదితాళంలో మమవతు సరస్వతి…, తిశ్ర, చతురస్రజతుల్లో ప్రదర్శించిన అలరిప్పు సభికుల హర్షధ్వనాలందుకున్నాయి. జతిస్వరం, వర్ణం, దేవరనామం… వంటి అంశాలతో చిన్నారుల నాట్యప్రావీణ్యం థిల్లానాతో ముక్తాయింపు ప్రేక్షకుల్ని మంత్రముగ్థం చేసింది. డాక్టర్ రమ్యా సూరజ్ నృత్యపరికల్పన చేసిన ఆయా అంశాలను భారతీ శ్రీనివాస్ షుశ్రూలో అభ్యసించిన చిన్నారుల బృందం ఆద్యంతం రసవత్తరంగా నాట్యభంగిమలు ప్రదర్శించడం అభినందనీయమని అతిథులు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఎం. రఘురాం ఆదిత్య తన సుతారమైన మునివేళ్లతో సితారపై సుశ్రావ్యమైన రసగుళికలొలికించి ప్రేక్షకులన్ననలందుకోవడం కార్యక్రమానికి వన్నెతెచ్చింది. శ్రీకాకుళానికి చెందిన కూచిపూడి, భరతనాట్య నిపుణులురాలు అనూరాథ, కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నాట్యాలను ఔపోశనపట్టిన రాజు మధురవాలలను నిర్వాహకుల తరపున ఘనంగా సత్కరించారు.














