భారత 11 వ రాష్ట్రపతి అవుల్ పకీర్ జైనులబ్దిన్ అబ్దుల్ కలాం శాస్త్ర సాంకేతిక రంగం లో భారత దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటి చెప్పారని పత్రికా సంపాదకులు సాహితీవేత్త బైస దేవదాసు అన్నారు. న్యూస్ పేపర్ బాయ్ లా పనిచేసి కష్టపడి చదివి ఒక గొప్ప శాస్త్రవేత్తగా మారి మన దేశ స్పేస్ ప్రోగ్రాం అభివృద్ధికి ఎనలేని కృషి చేసారని అన్నారు.శ్రీ మానస ఆర్ట్ ధియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో కళా లలిత కళావేదికలో భారత పూర్వ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏ.పీ.జె. అబ్దుల్ కలాం 92వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బైస దేవదాసు మాట్లాడుతూ… 1914 లో పంబన్ బ్రిడ్జి ప్రారంభించిన తర్వాత కలాం తండ్రి వ్యాపారం బాగా నష్టాల్లోకి వెళ్ళిందని, అబ్దుల్ కలాం చిన్న వయసులో ఉన్నప్పుడే వారి కుటుంబం చాలా పేదరికానికి గురైందని, తన కుటుంబ పరిస్థితి చూసి తన వంతు సహాయం చేయటానికి న్యూస్ పేపర్స్ అమ్మి కుటుంబానికి సహాయపడ్డారన్నారు. కలాం ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వాలియంట్ లకు కూడా డైరెక్టర్ గా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. తర్వాత కలాం యూనియన్ కేబినెట్ కు ఏరోస్పేస్ ప్రాజెక్ట్స్ ఎంత ముఖ్యమో ఎందుకు ఇండియా వీటిని అభివృద్ధి చేయాలన్న విషయం ఒప్పించడంలో కలాం కీలక పాత్ర పోషించారని దేవదాసు పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ మాట్లాడుతూ… కలాం ఎప్పుడు ప్రజల వ్యక్తిగా మెలిగారని, ప్రజలు కూడా కలాంని ఆధరించారన్నారు. కలాం భారత రత్న పురస్కారంతో కూడా సత్కరించబడ్డారని, భారతరత్న పొందిన రాష్ట్రపతులలో కలాం 3వ రాష్ట్రపతి అని ఆయన గుర్తు చేశారు. కలాం తన పదవి విరమణ తరువాత పలు కాలేజీల్లో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసారని ఆయన పేర్కొన్నారు. ఈ సభలో రచయిత డాక్టర్ అంబల్ల జనార్ధన్ అబ్దుల్ కలాం ఉత్తమ వ్యక్తిత్వం గురించి వివరంగా మాట్లాడారు. ఈ వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులకు అబ్దుల్ కలాం స్మారక పురస్కారాల ప్రదానోత్సవ సభను నిర్వహించారు. సందర్భంగా కరుణశ్రీ సేవా సమితి అధ్యక్షుడు ఆచార్య కడారి సత్యమూర్తిని, రచయిత్రి డాక్టర్ నర్మదా రెడ్డి ని సభలో పాల్గొన్న అతిథులు ఘనంగా సత్కరించి, అబ్దుల్ కలాం స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. పురస్కార స్వీకర్తలు సభలో స్పందన ప్రసంగాలు చేశారు. సంస్థ కార్యదర్శి డాక్టర్ రఘు శ్రీ సభకు స్వాగతం పలికారు. ముందుగా జరిగిన బహుభాషా కవి సమ్మేళనంలో పలువురు కవులు, కవయిత్రులు స్వీయ కవితా గానం మధురం చేశారు. కోదాటి అరుణ నిర్వహణ లో బహుభాషా కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్బంగా జరిగిన బహుబాష కవి సమ్మేళనం లో డాక్టర్ కోదాటి అరుణ, అరవ రవీంద్రబాబు, జేపీ కుమార్, నవనీతరావు, పగడాల రెడ్డమ్మ, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వాణి నృత్య కేతన్ విద్యార్థులు గురువు వాణి రమాసుందరి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి మానస సంస్థ అద్యక్షులు బండారిపల్లి రామచంద్రారావు రఘుశ్రీలు సమన్వయం గావించారు