ఈతరం భారతం హైదరాబాద్ జూలై 18 : సౌందర్య ( జననం జులై 18, 1972- మరణం ఎ ప్రిల్ 17, 2004) సినీనటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది. 12 సంవత్సరాలు నటిగా వెలిగిన ఈమె బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది. ఈమె 100కు పైగా చిత్రాలలో నటించింది.
సౌందర్య జననం(సౌమ్య)1972 జూలై 18 . ముళబాగల్, కోలారు జిల్లా, కర్ణాటక.మరణం
2004 ఏప్రిల్ 17 (వయసు: 31)బెంగళూరు, ఇండియా. వృత్తినటి.క్రియాశీల సంవత్సరాలు1992-2004 వరకు.జీవిత భాగస్వామిజి.ఎస్.రఘు (2003-2004)
జీవిత విశేషాలు:
సౌందర్య అసలు పేరు సౌమ్య. ఈమె జులై 18, 1972లో కర్ణాటక రాష్ట్రం, కోలారు జిల్లా, ముళబాగల్ లో జన్మించింది. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటపుడే మొదటి సినిమాలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి యొక్క స్నేహితుడు, గంధర్వ (1992) సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు సినిమా విజయవంతమైన తరువాత, ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది.
తరువాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. తెలుగులో ఆమె అంగీకరించిన తొలి సినిమా రైతుభారతం. ఈ సినిమాలో హీరో కృష్ణ మరదలిగా, భానుచందర్ సరసన నటించింది. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఆమెకు మనవరాలి పెళ్ళి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. రైతు భారతం చిత్ర నిర్మాణంలో జాప్యం జరగడంతో మనవరాలి పెళ్ళి మొదట విడుదలైంది.[5] అలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయఢంకా మ్రోగించింది. ఆమె కన్నడ, తమిళం, మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ సినిమాలో కూడా నటించింది. హిందీలో ఆమె అమితాబ్ బచ్చన్ తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ సినిమాలో నటించింది.సౌందర్య గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ సినిమా, ఉత్తమ ఛాయాచిత్రగ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి. ఇది పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శింపబడింది.సౌందర్య 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో మరణించింది. ఎన్నికల సందర్భంగా, భారతీయ జనతా పార్టీకి మద్ధతు పలుకుతూ ఆంధ్ర ప్రదేశ్లో ప్రసంగించడానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆమె సోదరుడు, కన్నడ చిత్రనిర్మాత అయిన అమర్‌నాథ్ కూడా ఆ ప్రమాదంలో మరణించాడు. ఆమె కన్నడంలో నటించిన ఆఖరి సినిమా “ఆప్త మిత్ర” విజయవంతమైంది. ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్ధం “సౌందర్య స్మారక పురస్కారం”ను కర్ణాటకాంధ్ర లలితకళ అకాడమి వారు ప్రతీ సంవత్సరం ఉగాది పండగ రోజున ఉత్తమ నటీమణులకు బహుకరిస్తున్నారు.
సినీ జీవితం
తెలుగు సినీపరిశ్రమలో అత్యంత ప్రతిభాశాలురైన నటీమణులలో సౌందర్య ఒకరు. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్ సరసన రాజా, జయం మనదేరా, పెళ్ళి చేసుకుందాం, పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రశంసలందుకున్నారు.[2][6] వారిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తింపబడ్డారు. పన్నెండేళ్ళ అచిరకాలంలోనే సౌందర్య ఆరు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలనందుకొంది. అవి అమ్మోరు (1994), అంతఃపురం(1998), రాజా (1999), ద్వీప (2002) (ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలు), ఆప్తమిత్ర (2004). కర్ణాటక ప్రభుత్వం నుంచి 4 ప్రతిష్టాత్మక పురస్కారాలు దొనిసగలి (తెలుగులో మహిళ), ద్వీప (ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలు), ఆప్తమిత్ర చిత్రాలకై అందుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను అమ్మోరు, పవిత్రబంధం, అంత:పురం చిత్రాలకై అందుకున్నారు. పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనిషిగా ఆవిడకు పేరు ఉంది. వీటన్నింటి మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాలలోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. సౌందర్యని తెలుగింటి ఆడపడుచుగా ఆదరించారు. ఆమెను జూనియర్ సావిత్రి అంటారు. సౌందర్యకు నవరసనటన మయూరి అనే బిరుదు ఉంది.
వ్యక్తిగత జీవితం
సౌందర్య తన మేనమామ, తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయిన జి.ఎస్.రఘును 2003 ఏప్రిల్ 27లో వివాహ మాడారు. ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కలలుండేవి. ఈమె తాను మరణించే నాటికి ‘కమ్లి’ అనే చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు, దీనికి దర్శకుడిగా కె.ఎన్.టి.శాస్త్రి వహించేవారు. ఈమె ‘అమర సౌందర్య సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ (ASSET) ద్వారా తన భర్త, ఆడపడుచు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్నాటక, ములబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగికుంటను అభివృద్ధి పరచారు. ఓ అనాథాశ్రమాన్ని, ‘అమర సౌందర్య విద్యాలయ’ పేరుతో ఓ పాఠశాల స్థాపించారు. తన తమ్ముడు అమరనాథ్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అంతేగాక తన భర్త, ఆడపడుచుల కలలను సాకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు, సహాయ సహకారాలను అందించారు. వీరి కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూనే ఉంది.
మరణం
2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భాజపా కి ప్రచారం చేసింది. అదే ఏడాది ఏప్రిల్ 17న బెంగళూరు లోని జక్కూరు విమానాశ్రయం నుంచి మనరాష్ట్రం లోని కరీంనగర్ లో పార్లమెంట్ అభ్యర్థి (బీజేపీ) విద్యాసాగర్‌రావు తరపున ప్రచారం చెయ్యడానికి చార్టెర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరనాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం (జీకేవీకే) ఆవరణంలో కుప్పకూలిపోవడంతో సజీవ దహనమయ్యారు.
సౌందర్య అగ్ర హీరోలందరి సరసన నటిస్తుందని, 8 ఏళ్ళు చాలా బిజీగా ఉంటుందని, 2004లో ఆమె కెరీర్ ఎండ్ అవుతుందని తొలి సినిమా సమయంలోనే సౌందర్య తండ్రి సత్యనారాయణ ఆమె జాతకం చెప్పాడు.















