హైదరాబాద్, జూలై 25 (ఈతరం భారతం);తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో నూతనంగా ఎంపికైన 23 మంది సీడీపీవోలకు నియామక పత్రాలను మంత్రి సీతక్క అందచేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా ఎంపికైన సీడీపీవోలు సచివాలయంలో మంత్రి చేతుల మీదుగా శుక్రవారం నాడు నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పండుగ వాతావరణం నెలకొంది. నూతన సీడీపీఓలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టినందుకు మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖకు సీడీపీఓలు వెన్నెముకలుగా పని చేస్తారని పేర్కొన్నారు.”మీరు పొందిన ఈ ఉద్యోగం ఒక సామాజిక బాధ్యత. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మద్దతుగా నిలిచే సేవా విభాగంలోకి అడుగుపెడుతున్నారన్న విషయాన్ని మీరెప్పటికీ మరిచిపోవద్దు” అని మంత్రి తెలిపారు. “వేల మంది పోటీ పడిన ఈ పరీక్షలో మీరు మాత్రమే ఉద్యోగాలు పొందరు. ఈ విజయానికి మీరు చూపిన అంకితభావం ప్రధాన కారణం. మీరు నిర్వర్తించే విధుల్లో ఇదే అంకిత భావాన్ని కొనసాగించాలి” అని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు సేవలందించే అదృష్టం మీకు దక్కిందన్నారు.అంగన్వాడీల్లో పోషకాహార లోపం తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ తో పాటు పాలు, గుడ్లను నిరంతరం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను ఆహ్లాద, ఆనంద కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. చిన్నారుల కోసం యూనిఫామ్స్ ను ఇవ్వడంతో పాటు 57 రకాల ఆటవస్తువులను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేశామన్నారు. అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడం, లబ్ధిదారులకు అన్ని హక్కులు కల్పించడమే ప్రధాన బాధ్యతగా సీడీపీఓలు పనిచేయాలన్నారు. కొత్తగా నియమితులైన అధికారులందరూ ఫీల్డ్ వర్క్‌ను ప్రాధాన్యంగా తీసుకుని, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రజల మధ్యకు వెళ్లాలని, ఏ విధమైన రాజకీయ ఒత్తిళ్లకు లోనవకుండా స్వేచ్ఛగా పనిచేయాలని సూచించారు మంత్రి సీతక్క.















