EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

విద్యార్ధులు పట్టుదలతో చదువు పై దృష్టి పెడితే ఏదైనా సాధించవచ్చు.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం/నేలకొండపల్లి, జూలై -25:మన జీవితం ఎలా ఉండాలనేది మన పైనే ఆధారపడి ఉంటుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.

నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తనిఖీ చేశారు. కళాశాల పరిసరాలను తిరిగి ప్రహరీగోడ నిర్మాణంతో పాటు విద్యార్థులకు కల్పించవలసిన సౌక్యరాలకు ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్, ఆధికారులను ఆదేశించారు. అనంతరం తరగతి గదిలో జరుగుతున్న విద్యా బోధనను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ తాను ప్రభుత్వ విద్యనే అభ్యసించి అనుకున్న లక్ష్యాన్ని సాధించానని కలెక్టర్ హితబోధ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఇంటర్ బోర్డు పరీక్షలతో పాటు విద్యార్థులు జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పోటీ పరీక్షలకు కూడా సమాంతరంగా సన్నద్దం కావాలని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నాం, మనం పోటీ పరీక్షలో రాణిస్తామో లేదో అనే అనుమానాలను విద్యార్థులు పూర్తి స్థాయిలో మైండ్ నుంచి తీసివేయాలని కలెక్టర్ తెలిపారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ చెప్పిన పాఠాలను శ్రద్ధగా వింటూ సిలబస్ రెగ్యులర్ గా చదువుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని, పోటీ పరీక్షల్లో రాణించడం వల్ల మంచి కళాశాలలో సీటు లభిస్తుందని, ఉజ్వల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.పోటీ పరీక్షలు రాయడం వల్ల తనకు బిట్స్ బిలానీ వంటి గొప్ప విద్యా సంస్థల్లో సీటు లభించిందని, అక్కడ చదివిన తర్వాత తన కెరీర్ చాలా అభివృద్ధి చెందిందని అన్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను వారం రోజులలో అందుబాటులో పెడతామని తెలిపారు.విద్యార్థులు తమ సమయం రీల్స్ చూస్తూ వృథా చేయకుండా, కాన్సెప్ట్ లను నేర్చుకోవడంలో శ్రద్ద పెట్టాలని, ఇంటర్నెట్ నుండి కూడా మనం విద్య నేర్చుకోవచ్చని అన్నారు. పట్టుదలతో విద్యార్థులు సమయాన్ని సానుకూలంగా వినియోగిస్తే గొప్ప విజయాలు సాధించగలుగుతారని, విద్యార్థులకు అవసరమైన సంపూర్ణ సహాయ, సహకారాలు ప్రభుత్వం తరపు నుండి అందిస్తామని అన్నారు.ఒత్తిడిని తట్టుకున్న తరువాతే వజ్రం తయారు అవుతుందని, అదే విధంగా మనకు కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడితే విజయం సాధ్యం అవుతుందని అన్నారు. జూనియర్ కళాశాల తరగతులను మిస్ కావద్దని కలెక్టర్ సూచించారు.  మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి మనదే బాధ్యత అవుతుందని అన్నారు. ఉపాధ్యాయుల బోధన, సూచనలు అనుసరించి బాగా చదువుకుంటే గొప్ప భవిష్యత్తు సొంతం అవుతుందని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట నేలకొండపల్లి మండల తహసీల్దారు వెంకటేశ్వర్లు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top