హైదరాబాద్, జూలై 28 (ఈతరం భారతం);:దశాబ్ద కాలం తర్వాత నిజమైన తెలంగాణ పోరాట యోధులకు గుర్తింపు లభించడం అభినందనీయమని తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు.ఆదివారం తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షులు నారగౌని పురుషోత్తం నేతృత్వంలో రవీంద్రభారతిలో తెలంగాణ సన్మాన్ 2025 పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీర్ల ఐలయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ స్మారక పురస్కారాన్ని బీర్ల ఐలయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయ సంస్థ జాయింట్ సెక్రెటరీ శ్యాం ప్రసాద్ లాల్ సభకు అధ్యక్షత వహించారు. భాషాభివృద్ధి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గౌరవ అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ బీసీ కమిషన్ సభ్యురాలు రంగు బాలలక్ష్మికి వీరనారి చిట్యాల ఐలమ్మ స్మారక పురస్కారాన్ని అందజేశారు. వీరితో పాటు సీనియర్ ఫిలిం క్రిటిక్ పొన్నం రవిచంద్రకు పైడి జయరాజ్ స్మారక పురస్కారం, ప్రముఖ గాయకులు దరువు అంజన్నకు ప్రజా యుద్ధ నౌక గద్దర్ స్మారక పురస్కారం, సీనియర్ పాత్రికేయులు కాసుల ప్రతాపరెడ్డికి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి స్మారక పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే అసలైన ఉద్యమకారులకు గుర్తింపు లభిస్తోందని అన్నారు. పది సంవత్సరాలుగా ఉద్దేశపూర్వకంగా అనగదొక్కిన కవులు, కళాకారులకు అసలైన గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. దొరల గడీలకు భజన చేసే కళాకారులకు తప్ప అసలైన ఉద్యమకారులకు గుర్తింపు లభించలేదని అన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా వారిని గుర్తించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కేవలం తనకు వంత పాడలేదన్న ఉద్దేశంతో కెసిఆర్ దూరం పెట్టిన వారందరిని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించి వారి అభిప్రాయాలు ఎలా ఉన్నా సరే ఉద్యమంలో వారు చేసిన పనిని గుర్తించి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ అవార్డు గ్రహీత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్ స్థాపించి నాటి అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు నిస్తూ ప్రోత్సహించే విధంగా కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరిట అవార్డు ఇవ్వడంతో తన బాధ్యతను పెంచిందని, ఈరోజు నుంచి మరింత జాగ్రత్తతో తన విధులు నిర్వర్తిస్తానని ఆయన అన్నారు. బీసీ కమిషన్ సభ్యురాలు, చాకలి ఐలమ్మ పురస్కార గ్రహీత రంగు బాలలక్ష్మీ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ నుంచి తాను రావడం, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటూ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడడం…, సాధించిన రాష్ట్రంలో వివక్షతను ఎదుర్కొంటూ దశాబ్ద కాలం తర్వాత ఇటువంటి సన్మానాన్ని అందుకోవడం సంతోషకరమని అన్నారు. పైడి జయరాజు పురస్కార అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ దాదాసాహెబ్ అవార్డు పొందిన పైడి జయరాజును తెలుగు చలనచిత్ర రంగం పరిశ్రమ అనేక దశాబ్దాలుగా విస్మరించిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆయన సేవలు గుర్తించలేదని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే అలా మరుగున పడిపోయిన వారికి గుర్తింపు లభిస్తోందని అన్నారు.గద్దర్ అవార్డు గ్రహీత దరువు అంజన్న మాట్లాడుతూ తెలంగాణ కోసం నిరంతరం కొట్లాడిన పోట్లాడిన గద్దర్ అన్న స్మారక అవార్డు తనకు లభించడం తనకెంతో చిరస్మరణీయమని తెలిపారు. పన్నెండ్లుగా గుర్తింపు లేని తమకు ఈ అవార్డు ఇవ్వడం గద్దర్ అన్నను స్మరించుకోనే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి స్మారక అవార్డు గ్రహీత కాసుల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఆ మహనీయుని పేరిట తనకు అవార్డు ఇవ్వడం తెలంగాణ ఉద్యమంలో తనను గుర్తించడం ఎంతో బాధ్యత పెంచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు మెరుగు చంద్రమోహన్, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు కాలేరు సురేష్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సీనియర్ నాయకురాలు మెరుగు సునీత తదితరులు పాల్గొన్నారు.















