ఈతరం భారతం ఖమ్మం జులై 28 :తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగానికి కేంద్ర బిందువుగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించాలని, రాష్ట్రానికి పర్యాటకంలో తలమానికంగా నిలిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, హార్టికల్చర్, హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పర్యాటక, ప్రొబిషన్, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ ఎం.డి.వల్లూరి క్రాంతి, జనరల్ మేనేజర్ ఉపేందర్‌రెడ్డిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో వివిధ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి పరిచి టూరిజం సెక్టార్‌ను బలోపేతం చేయాలని,ఏకో, టెంపుల్ టూరిజంల అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రులు ఆదేశించారు. నేలకొండపల్లి వద్ద ఉన్న బౌద్ధస్థూపం, పర్ణశాల, భద్రాచలం టెంపుల్ ప్రాంతాలలో విస్తృత అభివృద్ధికి ప్రణాళికలు రచించాలన్నారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా అన్ని హంగులతో భక్తి భావం ఉట్టిపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు, కొత్తగూడెం వద్ద హరితహోటల్, తల్లాడ మండలంలో కనిగిరిహిల్స్, వైరా రిజర్వాయర్, వెలుగుమట్ల అర్బన్ పార్కును నూతన హంగులతో పచ్చదనం, ఆధునిక వసతులు కల్పించాలని సూచించారు. ఖమ్మం ఖిల్లా వద్ద రోప్‌వే నగరానికి మణిహారంగా నిలవాలన్నారు. ఖమ్మంలో కొత్తగా ఒక హరిత హోటల్‌లను త్వరితగతిన నిర్మించేందుకు ప్రతిపాదనలను మరియు నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో టూరిజం డెవలప్‌మెంట్‌కు అనువైన వాతావరణం, ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ఆలయాలు ఉన్నాయని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రసిద్ధిగాంచిన భద్రాచలం రామాలయంను మరింత అభివృద్ధిపరిచి భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. తెలంగాణ పర్యాటక రంగానికి భద్రాద్రి రామలయం తలమానికంగా నిలిచేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి టూరిజం డిపార్టుమెంట్, కార్పొరేషన్‌లు కృషి చేయాలని మంత్రులు తెలిపారు. అందుకు కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గాని, ప్రైవేట్ భాగస్వామ్యంలో గాని వెంటనే మంజూరి చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. జిల్లాలో టూరిజం డిపార్టుమెంట్ అధికారులు, జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాలో టూరిజం అభివృద్ధి కోసం తగు కార్యాచరణను రూపొందించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే నెలలో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారని, టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటించేలోగా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం పట్టణ సమీపంలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వెలుగుమట్ల అర్బన్ పార్క్ అటవీ ప్రాంతంలో ఏకో టూరిజంకు సంబంధించిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఖమ్మం పట్టణంలో హరిత హోటల్ నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. కొత్తగూడెంలో ఉన్న హరితహోటల్ ని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు,జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించి, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎండీ, టూరిజంను మంత్రులు ఆదేశించారు.















