EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అవినీతి, డ్రగ్స్, కల్తీ పదార్థాలు.. కాంగ్రెస్ పాలన నిజ స్వరూపాలు పాలన అనే భావననే ప్రజలు మరిచిపోయే స్థితి ఏర్పడింది

హైదరాబాద్ జూలై 28 ( ఈతరం భారతం);తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న పాలనా తీరును బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ గారు తీవ్రంగా విమర్శించారు. అవినీతి, డ్రగ్స్, కల్తీ పదార్థాలు.. ఇవే కాంగ్రెస్ పాలన యొక్క నిజ స్వరూపాలుగా మారాయని ఆయన చెప్పారు. పాలన అనే భావననే ప్రజలు మరిచిపోయే స్థితి ఏర్పడిందని, ప్రతి వారం రాష్ట్రంలో ఏదో ఒక ఆశ్రమ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రుల పాలవుతున్న దుస్థితి దారుణమని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు పదే పదే జరుగుతున్నాయని, విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొన్నారు. అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా? విద్యాశాఖ మంత్రిగా బాధ్యత వహించే వారు ఉన్నారా? అనే సందేహం ప్రజల్లో పెరుగుతోందని తెలిపారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఔషధాల నుంచి నూనెల వరకు, ఆహార పదార్థాల నుంచి విద్యా కేంద్రాల వరకు, ప్రతి దాంట్లోనూ కల్తీ రాజ్యమేలుతోందని అన్నారు. ప్రజలు ఇప్పుడు మానవ బాంబుల్లా జీవిస్తున్న పరిస్థితి ఏర్పడిందని, ఇవి వెలుగులోకి వచ్చినవే తప్ప, వెలుగులోకి రాని ఘటనలు ఎన్నో ఉండే అవకాశం ఉందని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి మంత్రిత్వశాఖలోనూ అవినీతి రోజురోజుకు పెరిగిపోతోందని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ గారు విమర్శించారు. విజిలెన్స్ శాఖ ఏం చేస్తోంది? దాని స్థితిగతులు ఎవరికీ అర్థం కావడం లేదని ప్రశ్నించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఏ మాత్రం ఆసక్తి లేకుండా, ప్రభుత్వం మౌనం వహించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యపానమే ఆదాయ వనరుగా మలుచుకుంటోందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బెల్ట్ షాపులను తొలగిస్తామని ప్రకటించిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం శాసనసభలో బెల్ట్ షాపులే లేవని ఘనంగా ప్రకటించడం విడ్డూరమని మండిపడ్డారు. కానీ ప్రతి వైన్ షాప్ చుట్టూ పదికి పది బెల్ట్ షాపులు ఉన్నాయన్నారు. గత ఆరు నెలల్లో ఒక వైన్ షాప్‌కు వచ్చిన ఆదాయం రెట్టింపైన విషయాన్ని ప్రస్తావిస్తూ, మద్యం అమ్మకాలే ఇందుకు కారణమని చెప్పారు. బార్‌ల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని, రేవంత్ సర్కారు పాలనలో మూడు వైన్ షాపులకు ఆరు బార్‌లు అన్నట్లుగా మద్యం వ్యాపారం విస్తరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.భూములు అమ్మడం, మద్యం అమ్మడం, ప్రజల జీవన విలువలను తాకట్టు పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ గారు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు, వాగ్ధానాలు అమలు కావడంలేదని, ప్రజలను మద్యం మత్తులో ముంచి మభ్యపెట్టే యత్నం జరుగుతోందని ఆక్షేపించారు. ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రమాదంలో పడుతుండగా, విద్యార్థుల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మత్తు వ్యాపారానికి, కల్తీ పాలనకు ఒకే ఒక పరిష్కారం ఉందని, అందుకు బిజెపి యే విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు వస్తుందని స్పష్టంగా తెలిపారు.తెలంగాణలో ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పాలనా వ్యవస్థ నియంత్రణ కోల్పోయిందని, విజిలెన్స్ శాఖ నామమాత్రంగా మాత్రమే మిగిలిందని మండిపడ్డారు. ప్రతిరోజూ పత్రికల్లో, ప్రచార మాధ్యమాల్లో యాంటీ కరప్షన్ పేరిట ప్రచారం సాగుతున్నా, వాస్తవానికి రెవెన్యూ, పురపాలక, ఇరిగేషన్, సివిల్ సప్లైస్ శాఖల్లో పూర్తిగా అవినీతి రాజ్యమేలుతోందని పేర్కొన్నారు. పరిపాలన మొత్తం అవినీతిమయం అయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు వాటాలు ఇవ్వాల్సి వస్తోందని, అధికారులు ‘మేము ఏం చేయాలి?’ అన్నదానికన్నా ‘ఎంత పంచాలి?’ అనే దానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనే దురవస్థ నెలకొందని వివరించారు. అధికార పార్టీ నేతలతో పిచ్చాపాటి మాట్లాడినా “ఢిల్లీకి కూడా కట్టాలి కదబ్బా” అనే మాటలు వినిపిస్తున్నాయంటే.. పరిపాలన ఎంత కలుషితమైందో అర్థం చేసుకోవచ్చన్నారు.కాంగ్రెస్ పరిపాలన మొత్తం కల్తీ మయం అయిందని, మద్యం మయం అయిందని, డ్రగ్స్ మయం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కల్తీ విత్తనాలు పంపిణీ అవుతుండగా, ప్రజల ఆరోగ్యాలు కల్తీ ఆహారంతో ప్రమాదంలో పడుతున్నాయని తెలిపారు. ఈ కల్తీ విత్తనాల వ్యవహారం కూడా త్వరలో బయటపడుతుందని చెప్పారు. అసలు ముఖ్యమంత్రి ఎవరి కోసమే పనిచేస్తున్నాడో ప్రజలకు అర్థం కావడం లేదని, దేనికోసం ఇప్పటికీ పదవిలో ఉండాలనుకుంటున్నాడో చెప్పాలని ఎన్.వి.ఎస్.ఎస్. డిమాండ్ చేశారు. బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రెండు గంటలపాటు ప్రజల వినతిపత్రాలను స్వీకరించామని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తెలిపారు. వచ్చిన వినతుల్లో బెల్ట్ షాపుల వ్యాపారం, మద్యం దందాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం వంటి అంశాలపై ప్రజలు ఫిర్యాదులు, వినతలు సమర్పించారని చెప్పారు. అదే విధంగా ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు కూలిపోవడం, నాణ్యత లోపించడం, కేటాయింపుల్లో అవకతవకలు వంటి సమస్యలను కూడా ప్రజలు వినతిగా పెట్టారని వివరించారు. మరోవైపు జీహెచ్ఎంసీ అసలు ఉందా లేదా అనే అనుమానం కలిగేలా పరిస్థితి ఉందని ఎన్.వి.ఎస్.ఎస్. అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో హైదరాబాద్ మోకాళ్ళ లోతు నీటిలో మునిగిందని, గతంలో తండ్రి-కొడుకులు పురపాలక మంత్రులుగా ఉన్నా మారలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా పురపాలక శాఖ మంత్రిగా ఉన్నా అదే దుస్థితి కొనసాగుతోందని విమర్శించారు. ఈ ప్రభుత్వం చెబుతున్న రైజింగ్ పాలన అబద్ధపు వాగ్దానం మాత్రమేనని, “అందుబాటులో ఉన్నాం” అనే మాటలు ప్రజలకు కనబడటం లేదని మండిపడ్డారు. ప్రజలచే ఎన్నుకోబడిన.. ప్రజల కోసం పని చేయాల్సిన ప్రజాపాలన కనబడకుండా పోయిందని, ప్రజల వినతులకు స్పందించే స్థితిలో ఎవరూ లేరని ఆక్షేపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ పనిని అట్టహాసంగా ప్రారంభించి తర్వాత గాలికి వదిలేస్తోందని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ మండిపడ్డారు. అధికారుల నుంచి స్పందన కనిపించడం లేదనీ, ప్రజలకు సేవ చేసే విధానంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమ జేబులు నింపుకోవడానికే పాలన కొనసాగుతున్నదని, ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలన చేయలేని పరిస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం తప్పుకోవడం మంచిదని, బిజెపి తరఫున స్పష్టంగా హితవు పలుకుతున్నామని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ గట్టిగా హెచ్చరించారు.

Related News

Select the Topic
Scroll to Top