ఈతరం భారతం హైదరాబాద్ జూలై 31 :హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ విలువలతో కూడిన రాజకీయ నాయకుడు, అజాతశత్రువు అని శాసనమండలి డా. బండా ప్రకాశ్ అన్నారు. ప్రతియేటా హైదరాబాద్ బోనాలు ముగిసాక అందజేసే ‘మహాకాళి మహేశ్ గౌడ్ బోనాల ప్రతిష్ఠాత్మక 2025 పురస్కారం’ను ఈ ఏడాది బండారు దత్తాత్రేయకు అందజేశారు. ఈ సందర్భంగా గురువారం నాడు రవీంద్రభారతి ప్రధాన మందిరంలో ఈ ఉత్సవం కన్నుల పండుగలా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు అధ్యక్షత వహించారు.సభలో మాట్లాడుతూ బండారు దత్తాత్రేయ గారు… పాతబస్తీలో పుట్టి పెరిగిన తనకు ఈ పురస్కారం ఒక గొప్ప అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. “బోనాలు ఆడపిల్లల స్త్రీమూర్తులకు అర్పించే భక్తి పండుగ. ఇది మన సంస్కృతిలో ఆడపిల్లల గౌరవాన్ని ప్రతిబింబించే ప్రత్యేక పండుగ. మహిళలను గౌరవించడం నా సంప్రదాయం” అని అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో ప్రజా సేవను మాత్రమే ధ్యేయంగా పెట్టుకున్నానని, ప్రజల ప్రేమే తనకు పెద్ద బహుమతి అని తెలిపారు.ఎంఎల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ మహాకాళి మహేశ్ సింహవాహిని దేవాలయ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ మాట్లాడుతూ పాత నగర బోనాలు‑దేవాలయాల ప్రశస్తిని, వాటి అభివృద్ధికి కృషి చేసిన మహాకాళి మహేశ్, కె. ప్రకాశ్, వెంకట్‌స్వామి, లింగం మున్నగు వారి సేవలను స్మరించుకున్నారు. మాజీ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బండారు దత్తాత్రేయ సేవలను కొనియాడారు.కార్యక్రమంలో భాషా‑సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, జోగిని నిషా క్రాంతి, దివాగ్న శర్మ, మారుతి యాదవ్, గోపిశెట్టి రాఘవేందర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉత్తమ పాత్రికేయులకు, ఉత్తమ అధికారులకు అవార్డులు అందజేశారు.కార్యక్రమ సమన్వయకర్తలుగా ట్రస్ట్ చైర్మన్ కె. ప్రవీణ్ కుమార్, అధ్యక్షుడు జి. అర్వింద్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె. వెంకటేశ్ వ్యవహరించారు. కార్యక్రమంలో బోనాల నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రూపాల్లో ప్రదర్శించిన కళా ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.















