ఈ తరం భారతం హైదరాబాద్ ఆగస్టు 3 :కొత్త రేషన్‌కార్డులు పొందిన వారికి ఉచిత విద్యుత్తు, రాయితీపై గ్యాస్ సిలిండర్ తదితర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తించనున్నాయి. పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అవకాశం కల్పించింది. 10 ఏళ్లుగా రేషన్‌కార్డులు మంజూరు కాకపోవడంతో గత, ప్రస్తుత ప్రభుత్వంలో పలు పథకాలకు చాలా మంది అర్హులు దూరమయ్యారు. ప్రస్తుతం వారికి రేషన్‌కార్డులు మంజూరు చేయడంతో లబ్ధిదారుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వీరితోపాటు గతంలో రేషన్ కార్డు కలిగి ఉండి పథకాలు పొందనివారు సైతం వాటికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు పురపాలక ఆఫీసులు, ఎంపీడీవో(మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్) కార్యాలయాల్లో స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లావ్యాప్తంగా నూతనంగా 11,798 రేషన్‌కార్డులు అందజేయగా, అందులో నూతనంగా 23,701 మందికి అర్హులకు లబ్ధి చేకూరనుంది.లబ్ధిదారుల్లో ఆశలు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500లకే వంటగ్యాస్, గృహజ్యోతిలో 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్ లాంటి వాటికి రేషన్‌కార్డు తప్పనిసరి చేసింది. దీంతో కార్డులేని కుటుంబాలు పథకాలకు దూరమయ్యారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ సమస్య తీరనుంది.దరఖాస్తు విధానం ఇలా : గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మండల పరిషత్తు కార్యాలయాల్లో(ఎంపీడీవో ఆఫీస్), పట్టణాల్లోని లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయాల్లో సంప్రదించాల్సి ఉంటుంది. రాయితీ గ్యాస్ కోసం లబ్ధిదారులు తమ ఆధార్‌కార్డు, తెల్లరేషన్ కార్డు జిరాక్స్‌లతో పాటు గ్యాస్ కనెక్షన్ ధ్రువీకరణ పత్రాలు కౌంటర్లతో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు సంఖ్యను ప్రజా పరిపాలనలో కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే వారు పథకాలకు అర్హత పొందుతారు. కాగా ప్రస్తుతం వెబ్సైట్లో రాయితీ వంటగ్యాస్ ఆప్షన్ ఓపెన్ కావడంలేదని గృహజ్యోతి పథకం ఆప్షన్ మాత్రమే సెలక్ట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
నిరంతయ ప్రక్రియ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలుకు చేసేందుకు గాను మున్సిపల్ ఆఫీసుల్లో ప్రత్యేక ప్రజాపాలన కౌంటర్‌ను ఏర్పాటు చేశామని నారాయణ పేట పురపాలక సంఘం కమిషనర్ భోగేశ్వర్లు తెలిపారు. నూతనంగా రేషన్‌కార్డులు తీసుకున్నవారు మున్సిపల్ ఆఫీసుల్లో ప్రభుత్వం కల్పించిన సంక్షేమ పథకాలకు గతంలో దరఖాస్తు చేసుకోనివారు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాం. ప్రజాపాలన సేవాకేంద్రం నిరంతర ప్రక్రియ. ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పుర కమిషనర్ భోగేశ్వర్లు కోరారు.















