EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శిబూ సోరెన్ మృతి కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం

హైదరాబాద్‌ ఆగష్టు 4 (ఈతరం భారతం);: జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన మరణం జార్ఖండ్, తెలంగాణ వంటి దేశ ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు, జాతీయ ఫెడరల్ స్ఫూర్తికి, ఆదివాసీ సమాజానికి తీరని లోటని అన్నారు. ఈ సందర్భంగా శిబూ సోరెన్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి వారందించిన సహకారాన్ని స్మరించుకున్నారు. దేశ ఫెడరల్ స్ఫూర్తిని ప్రతిఫలించే దిశగా, శిబూ సోరెన్ చేపట్టిన జార్ఖండ్ స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి నింపిందన్నారు.2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) స్థాపన సమయంలో శిబూ సోరెన్‌ని హైదరాబాద్‌లో జరిగిన తొలి సభకు మొదటి అతిథిగా ఆహ్వానించుకున్నామని గుర్తు చేశారు. నాటి తెలంగాణ ఉద్యమానికి ఆయన తెలిపిన సంపూర్ణ సంఘీభావం మర్చిపోలేనిదని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన శిబూ సోరెన్, తాను ప్రారంభించిన తెలంగాణ మలిదశ ఉద్యమానికి అండగా నిలిచారని కేసీఆర్ తన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేశారు.2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా శిబూ సోరెన్ మద్దతుగా నిలిచారని, జార్ఖండ్, తెలంగాణ ప్రజల ఉద్యమ విజయాలు దేశ ఫెడరల్ స్ఫూర్తికి, ప్రాంతీయ, సామాజిక న్యాయానికి దిక్సూచిగా నిలిచాయని కేసీఆర్ తెలిపారు. శిబూ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడంతో రాష్ట్ర ఏర్పాటు కోసం ఒత్తిడి తేవడంలో కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతర కాలంలో 2022లో జార్ఖండ్‌లో శిబూ సోరెన్‌ని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తండ్రిని కోల్పోయి దుఃఖ సంద్రంలో మునిగిన వారి కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top