EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

దొడ్డు బియ్యం వేలంపై నిర్ణయం తీసుకోని ప్రభుత్వం

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 21 :రాష్ట్రవ్యాప్తంగా గోదాములు, రేషన్‌ షాపుల్లో మిగిలిపోయిన 1.40 లక్షల టన్నుల దొడ్డు బియ్యాన్ని వేలం వేస్తామని ప్రభుత్వం చెప్పడం కేవలం ప్రకటనలకే పరిమితమయ్యిందనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది.ఈ బియ్యాన్ని త్వరగా విక్రయించకపోతే ప్రభుత్వం రూ. 450 కోట్ల వరకు నష్టపోవచ్చని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఏప్రిల్నుంచి సన్న బియ్యం పంపిణీ చేయడంతో అంతకు ముందు రేషన్డీలర్ల వద్దనున్న దొడ్డు బియ్యం వారి వద్దే ముక్కిపోతున్నది. సన్న బియ్యం పంపిణీ చేసిన మరుసటి నెలలో దొడ్డు బియ్యం నిల్వలు వాపసు తీసుకెళ్లాలని ఉన్నతాధికారులను కోరినా వారు ఇప్పటివరకు పట్టించుకోవడం లేదని డీలర్లు వాపోతున్నారు. కొందరు డీలర్లు దొడ్డు, సన్న బియ్యం నిల్వలకు ప్రత్యేక గదులు తీసుకోకపోవడంతో దొడ్డు బియ్యానికి పట్టిన పురుగులు సన్న బియ్యానికి పడుతూ, సన్న బియ్యం కూడా పాడైపోయే పరిస్థితి ఏర్పడింది.

ఈ నెలాఖరులోగా వేలం వేయకుంటే చెత్త కుప్పలోకే..

ప్రభుత్వం వీలైనంత త్వరగా దొడ్డు బియ్యం నిల్వలు ఒక దగ్గరకు చేర్చి, ఈ నెలాఖరులోగా వేలం వేస్తే బెవరెస్ కంపెనీలకు, కోళ్ల ఫారాలకు ఉపయోగపడుతుందని, తర్వాత అయితే ఆ బియ్యాన్ని తీసుకునేందుకు వ్యాపారులు వెనకడుగు వేస్తారని డీలర్లు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బఫర్‌ గోదాముల్లో లక్ష టన్నులు, మండల స్థాయి స్టాక్‌ పాయింట్లలో 13 వేల టన్నులు, రేషన్‌ షాపుల్లో 27 వేల టన్నుల దొడ్డు బియ్యం నిల్వలున్నాయి. ఇటీవల ప్రభుత్వం దొడ్డు బియ్యం విక్రయానికి టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ప్రభుత్వం క్వింటాలుకు రూ.3,600 విక్రయించాలని భావిస్తుండగా, ఎఫ్‌సీఐ మాత్రం రూ.2,250 చొప్పున విక్రయాలకు ప్లాన్చేసింది. ఈ ధరకు బియ్యం అప్పగించటానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెప్పారు.

దొడ్డు బియ్యం కొనుగోలుకు పక్క రాష్ట్రాలు వెనకడుగు

ఇతర రాష్ట్రాల్లో ఆహార అవసరాలకు దొడ్డు బియ్యం విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. పౌరసరఫరాల శాఖ అధికారులు కర్ణాటక వెళ్లి సంప్రదింపులు చేసినా, వారి నుంచి స్పందన రాలేదు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ సహా ఎఫ్‌సీఐ ద్వారా తెలంగాణ బియ్యం వెళ్లే 8 రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు.

52 రోజులుగా తెరుచుకోని రేషన్దుకాణాలు

రేషన్బియ్యం మూడు నెలలకు ఒకేసారి పంపిణీ చేయడంతో ప్రస్తుతం 52 రోజులుగా డీలర్లు దుకాణాలు తెరవడం లేదు. దుకాణాలు తెరిస్తే దొడ్డు బియ్యం నిల్వలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుందని డీలర్లు అంటున్నారు. ఉన్న నిల్వలలో సగం నిల్వలు కూడా వేలానికి పనికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని డీలర్లు అంటున్నారు.

Related News

Select the Topic
Scroll to Top