హైదరాబాద్ ఆగస్టు 21 (ఈతరం భారతం);తెలంగాలో నిర్లక్ష్యపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ విమర్శించారు. వరుస కరెంట్ షాక్స్ వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతోన్నప్పటికీ, ప్రతి సంఘటన తర్వాత అధికారులు, సంబంధిత మంత్రులు “ఇది అనుకోని ఘటన” అని తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి శాఖలో లంచాలు, మామూలు పాలన కొనసాగుతుండటం, ప్రజల సమస్యలు పక్కన పెట్టి పనులు, లంచాలు పుచ్చుకోవడంలో మాత్రమే దృష్టిపెట్టినట్లుగా విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ ప్రజల వెన్ను విరిచే నిర్ణయమని ఎన్.వి.ఎస్.ఎస్. విమర్శించారు. ‘ఇంటికి బీరు – ఊరికో బార్’ విధానం రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచివేస్తోందని మండిపడ్డారు. హత్యలు, ఆత్మహత్యలు, అనారోగ్యాలు, అత్యాచారాలకు మద్యం మత్తే ప్రధాన కారణమని తెలిపారు. కానీ ప్రభుత్వం మాత్రం ‘ఇంటికి బీరు, ఊరికి బార్ – అదే మా ఖజానా’ అన్న ధోరణి తీసుకుందని విమర్శించారు. మరోవైపు “లిక్కర్ స్కామ్‌లలో తెలంగాణ ముద్రను గుర్తచేస్తూ.. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొన్ని కంపెనీలు, ఏజెంట్లు, కొంతమంది రాజకీయ నాయకులు భాగస్వాములుగా ఉన్నారని గుర్తించబడింది. అదేవిధంగా, బీర్ల సేకరణలో ముడుపులు కారణంగా ధరలు పెరిగినట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితి చూస్తే, ప్రభుత్వం ప్రజల శ్రేయస్సును పక్కన పెట్టి, లాభాల కోసమే పనిచేస్తున్నట్టుగా ఉందని ఆయన మండిపడ్డారు.రాబోయే రోజుల్లో మద్యం నియంత్రణ కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం ప్రారంభించబోతోందని ఎన్.వి.ఎస్.ఎస్. స్పష్టం చేశారు. మద్యం అమ్మకాలను పరిమితంగా, ప్రజల జీవన భద్రతను కాపాడే విధంగా నియంత్రించాలన్నారు. ప్రభుత్వ ఖజానా కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన విధానం కాదని ఆయన హితవు పలికారు.















