ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 23 :తొలి తరం జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ కు రాచకొండ ప్రెస్ క్లబ్, ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రింగ్ రోడ్లో జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టు షోయబుల్లాఖాన్ను దిక్సూచిగా చేసుకోవాలని, ఆయన ఆశయాలకి అనుగుణంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రెస్ క్లబ్స్ అధ్యక్షుడు అశోక్ గౌడ్ పొట్లపల్లిని, ప్రధాన కార్యదర్శి సానెం శ్రీనివాస్ గౌడ్ ను అభినందించారు. అశోక్ గౌడ్ పొట్లపల్లి మాట్లాడుతూ తొలితరం జర్నలిస్టుగా పేరొందిన షోయబుల్లాఖాన్ మహబూబాబాద్ నుండి హైదరాబాద్ పట్టణానికి వచ్చి సమసమాజం కోసం, అణగారిన అమాయక ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన బలంగా ఉన్న షోయబ్ జాతీయోద్యమ స్ఫూర్తితో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నారని మొదట షోయబ్ ‘తేజ్ ‘ఉర్దూ పత్రికలో ఉప సంపాదకుడిగా నిరంకుశ నిజాం ప్రభుత్వం, అతని తాబేదార్లయిన రజాకార్ల దౌర్జన్యాలు, అరాచకాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వార్తలనే అస్త్రాలను సంధించారని,ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం లో చివరకు ‘తేజ్’ పత్రికను నిషేధించారు.తేజ్ పత్రిక తర్వాత మందుముల నర్సింగరావు ఆధ్వర్యంలో వెలువడుతున్న ‘రయ్యత్’ అనే ఉర్దూ దినపత్రికలో చేరి పాలకవర్గాల దౌర్జన్యాలను, దోపిడీని చీల్చి చెండాడని,కొంత కాలానికి నిజాం ప్రభుత్వం ‘రయ్యత్’ పత్రికను కూడా మూసివేయించింది. తన భార్య, తల్లి ఆభరణాలు అమ్మి ‘ఇమ్రోజ్’ అనే ఉర్దూ పత్రికను ప్రారంభించారని ‘ఇమ్రోజ్’ అంటే ‘నేడు’ అని అర్థం. ‘ఇమ్రోజ్’ దినపత్రిక తొలి సంచిక 1947 నవంబరు 1 వ తేదీన వెలువడి, నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాల్సిందేనని ఖరాఖండిగా చెబుతూ సంపాదకీయాలు రాశాడు. విశాల దేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం తప్పనిసరి అని ఆయన సంపాదకీయాలలో పేర్కొన్నాడు. ‘పగటి ప్రభుత్వం – రాత్రి ప్రభుత్వం’ పేరుతో 1948 జనవరి 29 న ఒక వ్యాసంలో ఇత్తెహాదుల్ ముసల్మీన్ సంస్థపై ఎందుకు నిషేధం విధించదు ? అంటూ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించాడు. తాబేదారులైన ఖాసీం రజ్వి సేనలు ఆయనను ఆగస్టు 22 1948న అంతమొందించారని అన్నారు.. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పర్వతాలు నంబి, రామకృష్ణ గౌడ్ మాదగోని,లక్ష్మీనారాయణ గౌడ్ బోయపల్లి, బట్టు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని షోయబ్ అమర్ రహే నినాదాలతో ఘన నివాళులర్పించారు.















