ఈతరం సాహిత్యాంశం
మా ఊరి పండ్లు
మా ఊరి పండ్లు అన్నీ ప్రత్యేకం.
చిటమట, జీడి, మొర్రి, రేగు, మామిడి, తునికి, ఊడుగు, పులిచేరు ఉసిరికాయలు –
ప్రతి పండు వేరే రుచితో, వేరే జ్ఞాపకంతో మనసులో నిండిపోయేది.
“పండు అంటే రుచి కాదు బాబూ,
ఆ పండుకు వెనుక ఉన్న కథే నిజమైన రుచి,”
అని ఊరి పెద్దలు మెల్లగా పలికేవారు.
జీడిపండ్లు రాత్రి నీళ్లలో నానబెట్టి,
ప్రొద్దున్న మట్టి కుండలో ఏంచేవారు.
ఆ సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదట.
“మాటాడితే చేదవుతాయి బాబూ,”
అని మల్లేశం నమ్మకంగా చెప్పగా,
రాములు కన్నులో ఆశ్చర్యంతో,
“నువ్వు నమ్మినంతవరకూ అది నిజమే కదా!”
అని పెద్దల జ్ఞానం వింటూ మృదువుగా నవ్వేవాడు.
తునికీ పండ్లు అడవిలో దొరికితే తెచ్చేవారు.
మొదటగా కొద్దిగా చేదుగా ఉండి,
ఎండలో కాసేపు వుంచితేనే తీపి రసాలు ఉబికేవి.
“కొంచెం సహనం… ఆ తర్వాతే అసలు రుచి,”
అని బుచ్చయ్య పలికిన మాట,
పండులోనూ, జీవితంలోనూ సత్యంగా నిలిచేది.
మగవాడు ఎక్కలేని చెట్టు ఎక్కి
పండ్లు ఏరుకొచ్చి పంచిన ప్రమీలక్క –
ఆమె కళ్లలో వెలుగు, చేతుల్లో మమకారం.
“ఆమెకు చెట్టు ఎక్కడం శక్తి కాదు,
మనసులోని ప్రేమే నిజమైన పండుగ,”
అని ఊరి పెద్దలు ఒకరికి ఒకరు చెప్పుకునేవారు.
ఆమె తెచ్చిన పండ్ల వాసనతోనే
జ్ఞాపకాలు మధురంగా మారిపోయేవి.
సీతాఫలాలు తెల్లని ముత్యాల్లా మెరిసేవి.
రెండు తింటే ఆకలి మాయమైపోయేది.
సైన్యంలో నుండి సెలవొచ్చిన ఆనందం,
తల్లి కోసం సీతాఫలం వెతికి తెచ్చి తినిపించేవాడు.
ఆ దృశ్యం కేవలం రుచి కాదు –
అమ్మకోసం రాసిన జీవ కవిత.
గుట్టల మీద గరుగ్గయలు, ఉసిరికాయలు
నడిచిన అడుగులకే దొరికేవి.
కానీ మనిషి లోభం చెట్లను నరికేసి,
పండ్ల ఊపిరి నలిపేసింది.
“మనం చెట్టును నరికి తింటే,
మన భవిష్యత్తు ఎండిపోయేది కాదా?”
అని పెద్దలలో ఓ వేదన వినిపించేది.
కాలం తన వల వేయగా,
ప్రమీలక్క చేతిలో తునికీ ఆకు మాలిపోయింది.
మిగిలింది ఒక గాఢమైన మౌనం మాత్రమే.
“నువ్వు చేసిన కష్టాలను నేడు ఎవరు నమ్ముతారు!
అంత పెద్ద మూటలు నెత్తిమీద వేసుకుని
నవ్వుతూ వచ్చేవి నువ్వే కదా!”
అని ఊరి పెద్దలు తలదించుకుని మౌనమయ్యారు.
ఒక పట్టణపు చిన్నవాడు ఊరికి వచ్చి
చెట్టు మీద పండు చూసి ఆశ్చర్యంగా అడిగాడు:
“అమ్మా, ఈ పండు నిజంగానే చెట్టుపైన పుడుతుందా?
షాపులోలాగా ప్యాకెట్‌లో రాకపోవా?”
అమ్మ కళ్లలో నీళ్లు పొంగి,
బాల్యం మట్టి వాసనగా గుండెల్లో గుసగుసలాడింది.
ఆమె మాటల్లో మమకారం జాలువారింది:
“బిడ్డా, ఈ పండు కేవలం చెట్టుపైనే కాదు పుడుతుంది…
మనసులలోనూ పుడుతుంది.”
మరో చిన్నవాడు తన తండ్రిని అడిగాడు:
“నాన్నా, ఈ ఆకు నిజంగానే గుట్టల నుండి తెచ్చేవారా?
ఇప్పుడైతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే వస్తుంది కదా?”
తండ్రి ఆకాశం వైపు చూసి మౌనంగా పలికాడు:
“ఆర్డర్‌తో వస్తే రుచి వస్తుంది,
కానీ జ్ఞాపకం రాదు బాబూ.”
ఊరి పెద్దలు చివరగా ఇలా చెప్పారు:
“ప్రకృతిని కాపాడితేనే పండ్లు నిలుస్తాయి,
పండ్లు నిలిస్తేనే జ్ఞాపకాలు నిలుస్తాయి.
జ్ఞాపకాలు నిలిస్తేనే మనసు నిలుస్తుంది.
మనసు నిలిస్తేనే జీవితం నిలుస్తుంది.”
పండు రుచి కేవలం నాలుకకే కాదు –
మట్టి వాసనకూ, చెట్టు నీడకూ,
మనసు మమకారానికీ, కుటుంబ బంధానికీ సాక్ష్యం.
దానిని మరచిపోతే, మనిషి తన వేర్లను తానే కోసుకున్నట్టే
డా పెరుక రాజు
7810032847















