EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవాళికి మనుగడ: తెలంగాణ అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి డా. సి. సువర్ణ

ఈతరం భారతం సిద్దిపేట నవంబర్ 21

సిద్దిపేట జిల్లా ములుగు మండలం కేంద్రంలోని అటవి కళాశాల మరియు పరిశోధన సంస్థ (ఎఫ్.సీ.ఆర్.ఐ)లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తెలంగాణ ఉన్నత విద్యా మండలి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సౌజన్యంతో “పర్యావరణం మరియు వ్యర్థాల నిర్వహణ – సమస్యలు, ప్రభావాలు, సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిశోధకులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సదస్సుకు కళాశాల డీన్ వి. కృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా తెలంగాణ అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి డా.సి.సువర్ణ, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డా.డి.రాజిరెడ్డి, తెలంగాణ అటవీ సంరక్షణ అధికారి డా.ప్రియాంక వర్గీస్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డా.సి.సువర్ణ మాట్లాడుతూ “పట్టణీకరణ, నగరీకరణ వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది, వ్యర్థాలు పేరుకు పోతున్నాయి. ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ, భవిష్యత్తు ఉంటుంది. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని” అన్నారు.ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డా.డి.రాజిరెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్-2047 సిద్ధం చేస్తున తరుణంలో ఇలాంటి సదస్సు నిర్వహించడం పర్యావరణానికి గొప్ప మేలు చేస్తుంది. వ్యర్థాల నుండి సంపదను సృష్టించే పద్ధతులు కనిపెట్టి, కొత్త తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత యువత, పరిశోధకులు, విద్యార్థులు తీసుకోవాలని” అన్నారు.తెలంగాణ అటవీ సంరక్షణ అధికారి డా.ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ “ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, వ్యర్థాల నిర్వహణ మన స్వంత ఇంటి నుండే ప్రారంభం కావాలి. ప్రతి ఒక్కరూ రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ అనే నినాదాన్ని పాటిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ తీసుకోవాలని” పిలుపునిచ్చారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top