ఈతరం భారతం వరంగల్ జనవరి 2
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వైఖరి పూర్తిస్థాయిలో ద్వంద్వ వైఖరికి ప్రతీకగా మారిందని బిజెపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. ఒకవైపు కేసీఆర్ గారు శాసనసభకు రావాలని, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని పదేపదే కోరుతూనే… మరోవైపు అదే కేసీఆర్పై దోపిడీ, అవినీతి, అక్రమాలు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. అవినీతిపరుడిగా ఆరోపిస్తున్న వ్యక్తి సలహాలు ముఖ్యమంత్రికి ఎందుకు కావాలి అన్న ప్రశ్నకు రేవంత్ రెడ్డి స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ దగ్గర నుంచి రేవంత్ రెడ్డికి కావాల్సిన సలహాలు – దోచుకోవడంలోనా? దాచుకోవడంలోనా? లేక తెలంగాణ ప్రజల హక్కులను పణంగా పెట్టే పాలనా విధానాల్లోనా? అసలు ఈ సలహాలు పరిపాలన కోసం కావాలా… లేక రాజకీయ లావాదేవీలు, లోపాయికార ఒప్పందాల కోసమా అన్న అనుమానం ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం ఒక రాజకీయ నాటకమేనని, దాని వెనుక కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య లోపాయికార ఒప్పందం, అవగాహన దాగి ఉందన్న విషయం ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రజలకు అర్థమవుతోందని ప్రభాకర్ అన్నారు. పరిపాలన పేరుతో రాజకీయ లావాదేవీలు, రహస్య ఒప్పందాలే ప్రధాన అజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని విమర్శించారు.
అవినీతి కేసులపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం – కాంగ్రెస్-బీఆర్ఎస్ కుమ్మక్కుకు నిదర్శనం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి కేసులపై ప్రభుత్వ వైఖరి స్పష్టంగా అనుమానాలకు తావిస్తోందని ఎన్.వి.ఎస్.ఎస్. ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణను నీరుగార్చడం, ఫోన్ ట్యాపింగ్ కేసును కావాలని సాగదీయడం, ఫార్ములా ఈ-రేస్ అక్రమాలపై కాగ్, పీఏసీ నివేదికలు ఉన్నా ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం.. ఇవన్నీ కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న అంతర్గత ఒప్పందానికి స్పష్టమైన నిదర్శనాలని నిలదీశారు. భూముల అమ్మకాల విషయంలోనూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే విధానంతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అప్పనంగా అమ్ముకుంటున్నాయి. ఈ రెండు పార్టీల వ్యవహారం ‘నాకు నువ్వు-నీకు నేను’ అన్నట్టుగా పిల్లలాటలా సాగుతోందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ కేసుల్లో విచారణ తుది దశకు చేరుకున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క అరెస్టు కూడా జరగకపోవడం వెనుక అసలు కారణం ఏమిటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ఖజానాను దోచుకున్న వారిని చట్టపరంగా శిక్షించలేకపోయిందో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.గతంలో కాంగ్రెస్ పార్టీ శాసనభ్యులను బీఆర్ఎస్లో చేర్చుకోవడం, శాసనసభ-శాసనమండలిలో ఇతర పక్షాలను విలీనం చేసుకోవడం వంటి రాజకీయ అడ్డదారులు ఎంచుకున్న చరిత్ర అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్తో ‘నాకు నువ్వు – నీకు నేను’ అన్నట్లుగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఎన్.వి.ఎస్.ఎస్. రేవంత్ సర్కారుకు చురకలంటించారు. ప్రజాస్వామ్య విలువలు, ప్రజాసేవ అనే మాటలు పక్కన పెట్టి, అధికారం-దోపిడీనే లక్ష్యంగా చేసుకొని కాలం వెల్లదీస్తోంది.
పంచాయతీ ఎన్నికల గొప్పలు – గ్రామాభివృద్ధి మాత్రం శూన్యం
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరూ ‘మావాళ్లే గెలిచారు’ అంటూ గొప్పలు చెప్పుకోవడం చూస్తే, ఈ రెండు పార్టీల రాజకీయ నాటకాల తీరును ఎన్.వి.ఎస్.ఎస్. బట్టబయలు చేశారు కానీ వాస్తవం ఏమిటంటే-గ్రామాల అభివృద్ధికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీలేదు, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినదీ శూన్యమే. గతంలో బీఆర్ఎస్కు గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున అధికారం ఇచ్చినా సర్పంచుల ధర్నాలు, ఆత్మహత్యలు, నిరసనలు తప్పలేదు. ఇప్పుడు కాంగ్రెస్కు అదే స్థాయిలో అధికారం అప్పగించినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదన్నారు. అంటే గ్రామీణ తెలంగాణను అప్పటి బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీవ్రంగా నిర్లక్ష్యం చేశాయనేది రుజువైందని పేర్కొన్నారు. అధికారమే పరమావధిగా రెండు పార్టీలూ ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ ఆటలతో కాలం గడుపుతున్నాయన్నది గ్రామీణ తెలంగాణ ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
కేంద్ర నిధులే పంచాయతీలకు ప్రాణాధారం – రాష్ట్రం నుంచి దమ్మిడీ లేదు
గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంనుంచి కనీస నిధులే లేకపోవడం దారుణమైన వాస్తవం. ఈరోజు పంచాయతీలు నిలబడగలుగుతున్నాయంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చే నిధుల వల్లేనని ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ తేల్చిచెప్పారు. కేంద్రం నుంచి నేరుగా వచ్చే నిధులే పంచాయతీలకు ప్రాణాధారంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను పూర్తిగా విస్మరించడంతో ఒకవైపు గ్రామాల్లో మౌలిక వసతులు క్షీణిస్తుంటే, మరోవైపు భారీ ప్రాజెక్టుల పేరుతో దోపిడీ రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆయన మండిపడ్డారు.
కాళేశ్వరం తర్వాత పాలమూరు – అదే కథ, అదే దోపిడీ
గతంలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో స్థల మార్పిడి, అంచనాల పెంపు, వేల కోట్ల కమీషన్ల ఆరోపణలు ఎలా వచ్చాయో… ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకంలో కూడా అదే కథ, అదే దోపిడీ కనిపిస్తోందని ప్రభాకర్ మండిపడ్డారు. పార్టీ మారినా, ప్రభుత్వం మారినా విధానం మాత్రం మారలేదు. ఈ మొత్తం రాజకీయ నాటకానికి కనిపించని దారాలు లాగుతున్నది రాహుల్ గాంధీయే. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలను అనుసంధానం చేస్తున్నది రాహుల్ గాంధీయే. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న అంతర్గత బంధం, అనుబంధం రోజురోజుకీ బహిర్గతమవుతోందని నిగ్గుతేల్చారు.
ప్రభుత్వ ఆస్తులు కరిగిపోతే… మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయి
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు క్రమంగా కరిగిపోతుంటే… అధికారంలో ఉన్న మంత్రుల వ్యక్తిగత ఆస్తులు మాత్రం రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ భూములు అమ్మడం, ప్రజా ఆస్తులను తాకట్టు పెట్టడం, అదే సమయంలో వ్యక్తిగత సంపదను పెంచుకోవడం… ఇదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అసలు విధానమని ఎన్.వి.ఎస్.ఎస్. నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ అంటేనే కమీషన్లు, కరప్షన్, కాంట్రాక్టులు
పాలన పేరుతో ప్రజలను మభ్యపెట్టి, ఆస్తుల దోపిడీనే అజెండాగా ముందుకు వెళ్లడం కాంగ్రెస్ రాజకీయాలకు కొత్తేమీ కాదని…. కాంగ్రెస్ అంటేనే కమీషన్లు, కరప్షన్, కాంట్రాక్టుల రాజకీయాలు అన్న చేదు నిజం ఈరోజు దేశవ్యాప్తంగా బహిర్గతమవుతోంది. అందుకే క్రమేణా ఒక్కో రాష్ట్రంలో ప్రజల తీర్పుతో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతోంది. తెలంగాణ కూడా దీనికి మినహాయింపు కాదన్నది కాంగ్రెస్ పాలన మొదలైన కొద్ది కాలంలోనే స్పష్టమైందని ప్రభాకర్ తెలిపారు.తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్-బీఆర్ఎస్ కపటనాటకాన్ని, ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ రాజకీయాలను భారతీయ జనతా పార్టీ పూర్తిగా ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తుంది. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, అవినీతి పాలనను నిలదీస్తుంది. తెలంగాణ ప్రజలు గట్టిగా ఆలోచించి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు దగ్గరల్లోనే ఉందని డా.ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ హెచ్చరించారు.














