EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రైళ్లలో జనరల్ కోచ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను అంగీకరించిన కేంద్రం

ఈతరం భారతం తిరుపతి జూలై 22 రిపోర్టర్ మనోజ్ కుమార్ :

దేశవ్యాప్తంగా జనరల్ తరగతి కోచ్‌లకు పెరుగుతున్న డిమాండ్, ప్రయాణికుల రద్దీ, జనరల్ కోచ్‌ల ఏర్పాటు, సామాన్య ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యాల అందుబాటుపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత మూడు సంవత్సరాలుగా రిజర్వేషన్ లేని సాధారణ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆయన అంగీకరించారు. పండుగలు, సెలవుల సమయంలో రైళ్లలో రద్దీ అధికంగా ఉంటోందని తెలియజేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దూర ప్రయాణ రైళ్లలో కనీసం నాలుగు జనరల్ కోచ్‌లు ఉండేలా 1,250 కోచ్‌లను శాశ్వతంగా జోడించినట్లు తెలిపారు. 2025-26లో 870 కోచ్‌లు, అందులో 160 జనరల్ కోచ్‌లు, 2026-27లో ఇప్పటి వరకు 190 కోచ్‌లు, అందులో 20 జనరల్ కోచ్‌లు పెంచినట్లు వివరించారు.

సాధారణ, మధ్యతరగతి ప్రజల కోసం దేశవ్యాప్తంగా 17 వేల నాన్-ఏసీ కోచ్‌ల తయారీ చేపట్టినట్లు తెలియజేశారు. ప్రస్తుతం భారతీయ రైల్వేలో సుమారు 89 వేల కోచ్‌లు ఉండగా, వాటిలో 70 శాతం నాన్-ఏసీ కోచ్‌లు ఉన్నాయని వివరించారు. సాధారణ ప్రయాణికుల కోసం పూర్తిగా నాన్-ఏసీతో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఒక్కో అమృత్ భారత్ రైలులో 11 జనరల్ కోచ్‌లు, 8 స్లీపర్ కోచ్‌లు సహా మొత్తం 22 కోచ్‌లు ఉంటాయని తెలియజేశారు. ఈ రైళ్లలో సీసీటీవీ, యూఎస్‌బీ ఛార్జింగ్, ఆధునిక మరుగుదొడ్లు, అగ్నిమాపక వ్యవస్థ వంటి సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. 2026 జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా 36 జతల అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయని వెల్లడించారు. పండుగలు, సెలవుల సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడుపుతూ ప్రయాణికుల రద్దీని తగ్గిస్తున్నట్లు తెలిపారు. 2023-24లో 40,500, 2024-25లో 85,400, 2025-26లో 80,500 ప్రత్యేక రైలు ట్రిప్పులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధిక రద్దీ ఉన్న మార్గాల్లో మరిన్ని జనరల్ కోచ్‌లు, అదనపు రైళ్లు ఏర్పాటు చేసి సాధారణ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పార్లమెంటులో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top