EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మేడారం జాతరకు పకడ్బందీ వైద్య ఏర్పాట్లు: ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 10

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎలాంటి వైద్య ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి, జాతర వైద్య ఏర్పాట్లపై సమీక్షించారు. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే స్పందించి వైద్యం అందించేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.ఇప్పటికే గద్దెల వద్ద, జంపన్న వాగు సమీపంలో, ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద మూడు వైద్య శిబిరాలను ప్రారంభించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జాతర పరిసరాల్లో మరిన్ని మెడికల్ క్యాంపులు ముందస్తుగానే ప్రారంభించాలని మంత్రి సూచించారు. భక్తులు మేడారం బయలుదేరినప్పటి నుంచి దర్శనం పూర్తిచేసుకుని క్షేమంగా ఇళ్లకు చేరే వరకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

50 పడకల ప్రధాన హాస్పిటల్

జాతరలో అత్యవసర వైద్య సేవల కోసం మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకలతో ప్రధాన హాస్పిటల్ (శ్రీ సమ్మక్క–సారలమ్మ వైద్యశాల) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనంగా జంపన్న వాగు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద 6 పడకల సామర్థ్యంతో రెండు మినీ హాస్పిటళ్లు, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.

ఎనిమిది రూట్లలో క్యాంపులు

వివిధ జిల్లాల నుంచి భక్తులు వచ్చే ఎనిమిది ప్రధాన రూట్లలో 42 ఎన్‌రూట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. హనుమకొండ–మేడారం రూట్‌లో 9, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే భక్తుల కోసం 6, భద్రాచలం రూట్‌లో 5 క్యాంపులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

3,199 మంది వైద్య సిబ్బంది

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి 3,199 మంది వైద్య సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 72 మంది స్పెషలిస్టులు, 42 మంది లేడీ డాక్టర్లతో కలిపి 544 మంది వైద్యులు, 2,150 మంది పారామెడికల్ సిబ్బంది 24 గంటలు షిఫ్టుల వారీగా సేవలందిస్తారు.

35 అంబులెన్సులు సిద్ధం

అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించేందుకు 35 అంబులెన్సులను సిద్ధం చేశారు. అవసరమైతే రోగులను ములుగు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రులకు తరలించనున్నట్లు తెలిపారు. ఈ ఆసుపత్రుల్లో నెల రోజుల పాటు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.

మందుల కొరత లేకుండా చర్యలు

పాముకాటు విరుగుడు సహా 248 రకాల మందులు, సర్జికల్ సామగ్రిని ముందస్తుగా సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. జనవరి 25 నుంచి అన్ని వైద్య శిబిరాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని చెప్పారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ వెంటనే మేడారం వెళ్లి ఏర్పాట్లు పరిశీలించాలని ఆదేశించారు.

Related News

Select the Topic
Scroll to Top