హైదరాబాద్ ఫిబ్రవరి 17 ఈతరం భారతం:
24 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లోంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ సిద్దార్థరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ కొట్టివేయడంతో పాటు లోంగిపోవాలని ఆదేశించింది. ప్రత్యూష అనే యువతి సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంటర్ చదువుతున్నపుడు సిద్ధార్థరెడ్డి పరిచయం కావడంతో ఇద్దరు ప్రేమలో పడ్డారు. వీళ్ల ప్రేమను సిద్దార్థ రెడ్డి కుటుంబం ఒప్పుకోకపోవడంతో 2002 ఫిబ్రవరి 23న ప్రేమ జంట పురుగుల మందు తాగారు. వెంటనే ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రత్యూష చనిపోగా సిద్ధార్థరెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రత్యూషను ఆత్మహత్యకు ఉసిగొల్పాడని అతడికి స్థానిక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అతడు హైకోర్టును ఆశ్రయించడంతో సిద్ధార్థ రెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తన కూతురిది ఆత్మహత్య కాదని ప్లాన్ చేసి హత్య చేశారని సుప్రీంకోర్టులో ప్రత్యూష తల్లి సరోజినీ దేవి పిటిషన్ వేసింది. ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపి తుది తీర్పు ఇచ్చింది. సిద్ధార్థ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో పాటు రెండేళ్ల జైలు శిక్షను కూడా సమర్థించింది. సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్‌లో సముద్రం, రాయుడు, కలుసుకోవాలని సినిమాలలో నటించి ప్రత్యూష మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. బాలనటిగా ప్రేక్షకుల మెప్పుపొందారు. ఆమె కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు ఆమె హఠాత్తుగా చనిపోవడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 24 సంవత్సరాల తరువాత నిందితుడికి శిక్ష పడడంతో ఆమె అభిమానులు సరైన న్యాయం జరిగిందని తెలిపారు.















