హైదరాబాద్, ఫిబ్రవరి 23 ఈతరం భారతం:
తెలంగాణా హైకోర్ట్ W.P. No. 5442 of 2026 కేసులో 20.02.2026 తేదీన ఇచ్చిన ఆదేశాల మేరకు, ప్రతిపాదిత నూతన అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీపై సంబంధిత స్టేక్‌హోల్డర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, అందరికీ వాదనలు వినిపించే అవకాశం కల్పించిన అనంతరం మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఈ కేసును అడ్వకేట్లు వి. రూపేష్ కుమార్ రెడ్డి మరియు జి. సాయికృష్ణ వాదించారు. హోర్డింగ్ యజమానుల సమర్పించిన ప్రతినిధిత్వాలను పరిగణనలోకి తీసుకుని పాలసీని ఖరారు చేయాలని గౌరవనీయ న్యాయస్థానం రిట్ పిటిషన్‌ను పరిష్కరించింది.ఇంతకుముందు 20.04.2020 తేదీన జారీ చేసిన G.O. Ms. No. 68 అనంతరం, 2,600కు పైగా రూఫ్‌టాప్ హోర్డింగ్స్/యూనిపోల్స్ తొలగించబడ్డాయి. దీనివల్ల సుమారు 209 చిన్న, మధ్యతరహా సంస్థలు మూతపడగా, ప్రింటర్లు, ఫ్యాబ్రికేటర్లు, భవన యజమానులు సహా దాదాపు ఒక లక్షమంది అనుబంధ కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడింది. కేవలం 2–3 పెద్ద కంపెనీలకే సడలింపులు ఇచ్చినట్లు సమాచారం ఉండగా, అనేక చిన్న, మధ్యతరహా ఏజెన్సీలు సమీప మున్సిపాలిటీలకు మారాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాంతాలు కూడా గ్రేటర్ హైదరాబద్ మునిసిపల్ కార్పోర్వేషణ్ పరిధిలోకి విలీనం కావడంతో మళ్లీ అదే పరిమితులు అమలవుతున్నాయి.అసోసియేషన్, పూర్వం జేఎన్టియు సూచించిన మార్గదర్శకాల మేరకు కఠిన భద్రతా ప్రమాణాల కింద రూఫ్‌టాప్ హోర్డింగ్స్‌కు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇందులో స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేషన్, విండ్ లోడ్ అనుసరణ, నిర్దిష్ట కాల వ్యవధిలో తనిఖీలు, బీమా కవరేజ్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ మేరకు వివరణాత్మక ఇంజినీరింగ్ డిజైన్లు మరియు సాంకేతిక నివేదికలు ఇప్పటికే MA & UD ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మరియు GHMC అదనపు కమిషనర్ (అడ్వర్టైజ్‌మెంట్స్) కి సమర్పించబడ్డాయి.గౌరవనీయ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, హోర్డింగ్ యజమానుల అసోసియేషన్ సమర్పించిన అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఎటువంటి తుది నిర్ణయం తీసుకోరాదని, సరైన వాదనలు వినిపించే అవకాశం కల్పించి, సముచితమైన కారణాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేయాలని అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.















