EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

నాలుగు సార్లు ఫైనల్ చేరిన తొలి టీమ్ ఇండియా..సెమీస్లో నమోదైన రికార్డులు ఇవే !

వార్తాంశం: ఈతరం భారతం

టి 20 వరల్డ్ కప్

నాలుగు సార్లు ఫైనల్ చేరిన తొలి టీమ్ ఇండియా..సెమీస్లో నమోదైన రికార్డులు ఇవే !

సెమీస్‌లో 7 రన్స్‌ తేడాతో ఇంగ్లండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ

టీ20 వరల్డ్ కప్‌లో నాలుగోసారి తుదిపోరు చేరి రికార్డు

శాంసన్, దూబే ధనాధన్‌

బెథెల్ సెంచరీ పోరాటం వృథా_

ఆదివారం న్యూజిలాండ్‌తో సూర్యసేన టైటిల్ ఫైట్‌_ఎక్కడ తడబడ్డామన్నది కాదు.. ఎలా తిరిగి కొట్టామన్నదే ముఖ్యం! సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత అసలు ఇది ఆటేనా అని విమర్శించిన వారి ముందే టీమిండియా తన విశ్వరూపం చూపించింది. జింబాబ్వే, వెస్టిండీస్‌ను చిత్తు చేసి నాకౌట్ చేరిన ఇండియా ఇప్పుడు సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు వంద శాతం న్యాయం చేస్తూ, అంచనాలను అందుకుంటూ వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. మూడోసారి టీ20 వరల్డ్ కప్‌ గెలిచి తీన్‌మార్ కొట్టేందుకు అడుగు దూరంలో నిలిచింది._

టీ20 వరల్డ్ కప్‌ నాకౌట్ మ్యాచ్‌ అంటే సగటు అభిమాని ఏం ఆశిస్తాడో వాంఖడే స్టేడియంలో అదే జరిగింది! ఫోర్లు, సిక్సర్ల వర్షంతో మైదానం తడిసి ముద్దయింది. మన ఓపెనర్ సంజూ శాంసన్ (42 బాల్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89) ఖతర్నాక్ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికి ఆరేసి జట్టుకు భారీ స్కోరు అందిస్తే.. ఛేజింగ్‌లో జాకబ్ బెథెల్ (48 బాల్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 105) మెరుపు సెంచరీతో వణికించాడు. కానీ, చివర్లో బుమ్రా, హార్దిక్ సూపర్ బౌలింగ్‌తో కట్టడి చేయడంతో నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఇండియా అద్భుత విజయం అందుకుంది. ముంబైలో ఇంగ్లిష్ టీమ్‌పై సింహగర్జన చేసిన సూర్యసేన ఆదివారం అహ్మదాబాద్‌ టైటిల్ ఫైట్‌లోనూ గర్జించేందుకు సిద్ధమైంది._

న్యూజిలాండ్.. కాస్కో ఇక!

ముంబై: టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా రికార్డు స్థాయిలో నాలుగోసారి ఫైనల్ చేరింది. అచ్చొచ్చిన వాంఖడే స్టేడియంలో రన్‌రంగం సృష్టించిన ఇండియా గురువారం జరిగిన సెమీఫైనల్లో 7 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌పై థ్రిల్లింగ్‌ విక్టరీతో ఫైనల్ చేరింది. శాంసన్ మరోసారి తన విశ్వరూపం చూపెట్టడంతో తొలుత ఇండియా 253/7 స్కోరు చేసింది. శివమ్ దూబే (25 బాల్స్‌లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 43) కూడా సత్తా చాటాడు. విల్ జాక్స్‌, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో బెథెల్‌ పోరాడినా ఇంగ్లిష్ టీమ్ ఓవర్లన్నీ ఆడి 246/7 స్కోరు చేసి ఓడింది. హార్దిక్(2/38) రెండు వికెట్లు పడగొట్టగా.. జస్‌ప్రీత్ బుమ్రా (1/33) పొదుపుగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది._

సంజూ మరో ధమాకా

ఓపెనర్ శాంసన్ వరుసగా రెండో ఫిఫ్టీతో విజృంభించడంతో ఫస్ట్ బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా భారీ స్కోరు చేసింది. తొలి ఓవర్లోనే ఆర్చర్‌కు సంజూ 4,6తో స్వాగతం పలకగా.. విల్ జాక్స్‌ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అభిషేక్ శర్మ (9) వైడ్‌బాల్‌ను వెంటాడి సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో బ్రూక్‌ క్యాచ్ డ్రాప్‌ చేయడంతో వచ్చిన లైఫ్‌ను శాంసన్‌ రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. ఖతర్నాక్ షాట్లతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్‌ కిషన్ (39) కూడా బ్యాట్ ఝుళిపించడంతో పవర్‌ ప్లేలోనే ఇండియా 67/1 స్కోరు చేసింది. స్పిన్నర్లు ఆదిల్ రషీద్‌, లియాన్ డాసన్ రెండు ఎండ్ల నుంచి దాడి చేసినా శాంసన్ అద్భుతంగా ఎదుర్కొన్నాడు. డాసన్ బౌలింగ్‌లో సిక్స్‌తో సంజూ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. ఇషాన్ కూడా సిక్స్ బాదాడు. ఆపై కరన్‌ బౌలింగ్‌లో ఇషాన్ సిక్స్‌, శాంసన్ 6,4 కొట్టడంతో 9 ఓవర్లలోనే స్కోరు వంద దాటింది. ఫిఫ్టీ చేసేలా కనిపించిన ఇషాన్‌ను పదో ఓవర్లో ఆదిల్ పెవిలియన్ చేర్చడంతో రెండో వికెట్‌కు 97 పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. ఈ టైమ్‌లో కెప్టెన్ సూర్య తాను రాకుండా లెఫ్టాండ్ హిట్టర్ శివమ్ దూబేను నాలుగో నంబర్‌లో పంపించాడు._

ఈ ప్లాన్‌ కూడా వర్కౌట్ అయింది. శాంసన్‌, దూబే పోటాపోటీగా భారీ షాట్లు కొడుతూ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించగా 13 ఓవర్లకే స్కోరు 160 దాటింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న శాంసన్‌ను తర్వాతి ఓవర్లో ఫిల్ సాల్ట్ పెవిలియన్ చేర్చడంతో మూడో వికెట్‌కు 43 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. సంజూ ఔటయ్యాక ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకునే ప్రయత్నం చేశారు. రషీద్ వేసిన 16వ ఓవర్లో ఓ బాల్‌ను స్టాండ్స్‌కు పంపిన కెప్టెన్ సూర్య (11) వెంటనే స్టంపౌటయ్యాడు. ఓవర్టన్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా (27) తన మార్కు క్రేజీ షాట్లతో మూడు ఫోర్లు రాబట్టడంతో స్కోరు 200 దాటింది. 18వ ఓవర్లో ఇంకో సిక్స్ కొట్టిన దూబే రనౌటవగా.. ఆర్చర్‌ బౌలింగ్‌లో తిలక్ వర్మ (21) మూడు సిక్సర్లు, లాస్ట్ ఓవర్లో హార్దిక్ రెండు సిక్సర్లు బాది స్కోరు 250 మార్కు దాటించారు._

బెథెల్ భయపెట్టినా.

భారీ టార్గెట్ ఛేజింగ్‌లో జాకబ్ బెథెల్ భారీ హిట్టింగ్‌తో భయపెట్టినా కీలక సమయాల్లో వికెట్లు తీసిన బౌలర్లు ఇండియాను గెలిపించారు. రెండో ఓవర్లో తన తొలి బాల్‌కే డ్యాషింగ్ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (5)ను ఔట్ చేసిన హార్దిక్ ప్రత్యర్థి పతనానికి నాంది పలికాడు. మరో ఓపెనర్‌ జోస్ బట్లర్ (25) వరుస ఫోర్లతో విజృంభిస్తున్నా.. బుమ్రా వేసిన ఐదో ఓవర్లో అక్షర్ సూపర్ క్యాచ్‌కు కెప్టెన్ హ్యారీ బ్రూక్ (7) వెనుదిరిగాడు. కానీ, నాలుగో నంబర్‌లో వచ్చిన బెథెల్‌ తన రెండో బాల్‌తో సిక్స్‌తో ఖాతా తెరిచాడు._

స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి హ్యాట్రిక్‌ సిక్సర్లతో స్వాగతం పలికాడు. అదే ఓవర్లో బట్లర్‌ను వరుణ్ బౌల్డ్ చేయగా.. పవర్ ప్లేను ఇంగ్లండ్ 68/3తో ముగించింది. ఎనిమిదో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన టామ్ బాంటన్ (17)ను అక్షర్ తర్వాతి బాల్‌కే బౌల్డ్ చేయడంతో 95/4తో ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది. కానీ, విల్‌ జాక్స్‌ (35) తోడుగా బెథెల్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ 19 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఇంకోవైపు జాక్స్ కూడా జోరు పెంచడంతో 13 ఓవర్లకే ఇంగ్లండ్ స్కోరు 160 దాటింది. ఈ దశలో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన అర్ష్‌దీప్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌పై ఫుల్‌ టాస్ వేసి జాక్స్‌ను ఔట్ చేయడంతో ఐదో వికెట్‌కు సెంచరీ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది._

చివరి 4 ఓవర్లలో 61 రన్స్ అవసరం అవగా.. బెథెల్ క్రీజులో ఉండటంతో ఇంగ్aండ్ఆశలు కోల్పోలేదు. అర్ష్‌దీప్ వేసిన 17వ ఓవర్లో తను వరుసగా 6, 4 కొట్టి టెన్షన్ రేపాడు. కానీ, 18వ ఓవర్లో బుమ్రా ఆరు రన్సే ఇవ్వడంతో సమీకరణం 12 బాల్స్‌లో 39 రన్స్‌గా మారింది. 19వ ఓవర్‌ ఫస్ట్ బాల్‌కే బెథెల్ భారీ సిక్స్ కొట్టినా.. మూడో బాల్‌కు కరన్ (18) ఔట్‌ చేసిన పాండ్యా 9 రన్సే ఇచ్చాడు. దాంతో దూబే వేసిన లాస్ట్ ఓవర్లో ఇంగ్లండ్‌కు 30 రన్స్ అవసరం అవగా.. ఫస్ట్ బాల్‌కే బెథెల్ రనౌటవ్వడంతో ఇండియా విజయం ఖాయమైంది. ఆర్చర్ (19 నాటౌట్‌) మూడు సిక్సర్లు కొట్టినా గెలుపు అంతరం మాత్రమే తగ్గింది.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 253/7 (శాంసన్ 89, దూబే 43, ఇషాన్ 39, జాక్స్ 2/40)._

ఇంగ్లండ్‌: 20 ఓవర్లలో 246/7 (బెథెల్ 105, జాక్స్ 35, హార్దిక్ 2/38)._

బ్రూక్ వదిలేశాడు.. అక్షర్ పట్టేశాడు..

‘క్యాచెస్ విన్స్ మ్యాచెస్’ అనేది మరోసారి నిరూపితమైంది. మూడో ఓవర్లోనే శాంసన్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను మిడాన్‌లో ఇంగ్లండ్ కెప్టెన్‌ బ్రూక్ డ్రాప్ చేశాడు. అప్పటికి 15 రన్స్‌ వద్ద ఉన్న శాంసన్ ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకొని ఇండియాకు భారీ స్కోరు అందించాడు. మరోవైపు అక్షర్ పటేల్ రెండు అద్భుత క్యాచ్‌ల్లో భాగమై ఇండియాను గెలిపించాడు. ఐదో ఓవర్లో బుమ్రా స్లో బాల్‌ను బ్రూక్‌ కవర్స్‌ మీదుగా గాల్లోకి లేపగా.. అక్షర్‌ ముందుకు పరుగెడుతూ ఖతర్నాక్ క్యాచ్ అందుకున్నాడు._

ఆపై బెథెల్‌తో కలిసి భారీ షాట్లు ఆడుతున్న జాక్స్‌ 14వ ఓవర్లో ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ రోప్ వద్ద అందుకున్న అక్షర్ బ్యాలెన్స్‌ కోల్పోయి లైన్ దాటేముందే పక్కనున్న దూబేకు బాల్‌ అందించాడు. మొత్తంగా శాంసన్‌ క్యాచ్‌ను డ్రాప్ చేసిన బ్రూక్‌ కప్పును వదిలేయగా.. అక్షర్ అసాధారణ ఫీల్డింగ్‌ ఇండియాను కప్పు ముంగిట నిలిపింది.

499ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి వచ్చిన రన్స్‌. టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలోనే అత్యధికం. 2016లో ఇదే స్టేడియంలో ఇంగ్లండ్‌-సౌతాఫ్రికా మ్యాచ్‌లో నమోదైన 459 రన్స్ రికార్డు బ్రేక్ అయింది.

34 ఈ పోరులో నమోదైన సిక్సర్లు. టీ20 కప్‌ మ్యాచ్‌లో అత్యధికం.88 ఈ టోర్నీలో ఇండియా బాదిన మొత్తం సిక్సర్లు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో ఓ జట్టుకు అత్యధికం.105 జాకబ్ బెథెల్ చేసిన రన్స్ టీ20 కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో హయ్యెస్ట్‌.

253/7 టీ20 కప్ నాకౌట్‌ మ్యాచ్‌లో హయ్యెస్ట్ స్కోరు చేసిన టీమ్‌ ఇండియా .73ఈ మ్యాచ్‌లో నమోదైన మొత్తం బౌండరీలు (39 ఫోర్లు, 34 సిక్సర్లు). 2016లో ఇంగ్లండ్‌–సౌతాఫ్రికా (61) పేరిట ఉన్న వరల్డ్ కప్ రికార్డు కనుమరుగైంది._

Related News

Select the Topic
Scroll to Top