హైదరాబాద్ మార్చ్ 21 ఈతరం భారతం :
కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా ప్రజలను మోసం చేస్తూ, అవినీతికి పాల్పడుతూ, హిందూ వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ముందుకు సాగుతోందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ విమర్శించారు.శనివారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా ప్రజలను మోసం చేస్తూ, అవినీతి మరియు నిర్వీర్యమైన పాలనతో తెలంగాణను సంక్షోభంలోకి నెట్టింది. ప్రజా సమస్యలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక ప్రజల ముందే నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.అందుకే బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సారథ్యంలో అసెంబ్లీ ముట్టడి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధ్యత వహించేలా చేస్తామన్నారు.నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, నిరుపేదలు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలతో మార్చి 23న జరిగే అసెంబ్లీ ముట్టడిలో పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ సర్కారును నేరుగా ప్రశ్నించాలని కోరారు.తెలంగాణ ఉద్యమంలా ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తేనే మార్పు సాధ్యం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజల పక్షాన పనిచేసేలా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఏ విషయంపై మాట్లాడినా ‘డబ్బులు లేవు’ అనే సమాధానమే వినిపిస్తోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణను ఈ దుస్థితికి తీసుకువచ్చాయిని దుయ్యబట్టారు. బడ్జెట్‌లోనైనా ప్రజలకు ఉపయోగపడే చర్యలు తీసుకుంటారని ఆశించినా, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తూ, ప్రజల హక్కుల సాధన కోసం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు.ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ నాయకులను ప్రజల ముందే నిలబెట్టి నేరుగా ప్రశ్నిద్దాం. ప్రజా సమస్యలను నిజంగా పరిష్కరిస్తారా? లేక మాటలకే పరిమితమవుతారా? అనే విషయంలో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేద్దాం. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా తప్పించుకునే రాజకీయాలకు ఇక స్థానం లేదని తెలియజేయాలన్నారు.అలా చేయకపోతే, ప్రజలే వారిని ఎక్కడికక్కడ నిలదీసే పరిస్థితిని తీసుకురావాలి. హైదరాబాద్‌లోనే కాదు, తెలంగాణలోని ఏ గ్రామానికైనా వెళ్లినా ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే అన్న పరిస్థితి తీసుకురావాలన్నారు.ఈ అసెంబ్లీ ముట్టడిలో తెలంగాణలోని నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలి, “ఉద్యోగాలు వస్తాయి” అనే ఆశతో ఎన్నాళ్లుగానో ఎదురుచూసి చివరకు నిరాశ చెందిన ప్రతి నిరుద్యోగి ముందుకు రావాలి. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అందక కాలేజీలకు వెళ్లలేని దుస్థితిలో ఉన్న విద్యార్థులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. “ఎప్పటికైనా మాకు ఇల్లు వస్తుంది” అని ఆశపడి ఇప్పటికీ ఇల్లు అందని నిరుపేదలు కూడా తమ గళం వినిపించాలి. వృద్ధాప్యంలో పని చేయలేని పరిస్థితిలో ఉండి, ప్రభుత్వం హామీ ఇచ్చిన పెన్షన్ కోసం ఎదురుచూస్తూ మోసపోయామని భావిస్తున్న వృద్ధులు కూడా తమ ఆవేదనను ప్రజల్లో వినిపించాలి. అలాగే రైతు భరోసా అందక మోసపోయామని భావిస్తున్న ప్రతి రైతు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేసారు.మార్చి 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నించే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేసారు.మనం రోడ్లపైకి రాకపోతే మార్పు సాధ్యం కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి, వంటవార్పు చేస్తూ, నిరంతర పోరాటం చేసినందువల్లే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగాం. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా బాధ్యత వహించేలా, ప్రజల మాట వినేలా చేయడానికి ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య , బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాషా , బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.















