EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పెట్రోల్, డీజిల్ కొరత  ? !

ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 28

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పెట్రోల్, డీజిల్ కొరత నెలకొంది. హైదరాబాద్‌లోని పలు బంకుల్లో మూడో రోజూ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్‌ ఉన్న బంకుల ముందు వాహనాలు బారులు తీరుతున్నాయి. చంపాపేట్‌, ఐఎస్‌ సదన్‌లో పెట్రోల్‌ బంకుల ముందు వాహనదారులు ఆందోళనకు దిగారు. గంటల తరబడి క్యూలో ఉండాల్సి వస్తోందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్‌ బంకుల వద్ద వాహనాలు రోడ్లపై నిలవడంతో ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడుతోంది. బంకుల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు కొన్నిచోట్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనదారులు బాటిల్స్, క్యాన్స్లలో ఇంధనం నింపుకోకుండా పహారా కాస్తున్నారు.

పరిమిత స్థాయిలోనే పెట్రోల్‌ : సంగారెడ్డి జిల్లాలో మొత్తం 193 బంకులు ఉన్నాయి. అందులో ఎక్కువ శాతం బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్‌ ఎక్కడా దొరకడం లేదని, కొన్ని బంకుల్లో మాత్రమే అదీనూ పరిమిత స్థాయిలోనే పెట్రోల్‌ లభిస్తుందని వాహనదారులు చెబుతున్నారు. బండి చక్రం నడిస్తేనే తమ బతుకు చక్రం సాగుతుందని వారు చెబుతున్నారు.

కొరతగా ఉందన్న ప్రచారం : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరతగా ఉందన్న ప్రచారంతో వాహనదారులు క్యూ లైన్లు కడుతున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకడం లేదన్న వదంతులతో బంకుల్లో వాహనాలతో బారులు తీరిన వాహనదారులు, పెద్ద డబ్బాల్లో పెట్రోల్, డీజిల్ తీసుకెళ్తున్నారు. కొరత లేకుండా పెట్రోల్, డీజిల్ అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు బంకుల్లో పెట్రోల్, డీజిల్ అయిపోగానే, సరిపడా స్టాక్ బంకులకు వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. వాహనదారులు వదంతులను నమ్మి బంకుల్లో బారులు తీరి, పెద్ద డబ్బాల్లో పెట్రోల్, డీజిల్ తీసుకెళ్లవద్దని సూచిస్తున్నారు.

స్టాక్ ఉన్నప్పటికీ పంపిణీ చేయని పరిస్థితి : మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ల కోసం రైతులు, వాహనదారులు బంకుల ముందు బారులు తీరుతున్నారు. మహబూబాబాద్ పట్టణంలోని ఇల్లందు రోడ్డులో పెట్రోల్ బంకులో స్టాక్ ఉన్నప్పటికీ పంపిణీ చేయడం లేదంటూ బంక్ ఎదుట రహదారిపై వాహనదారులు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనతో మహబూబాబాద్ఇ-ల్లందు ప్రధాన రహదారిపై ఇరువైపుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న సీఐలు అంజలి, మహేందర్ రెడ్డి సిబ్బందితో పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొని అందరికీ నచ్చచెప్పి రాస్తారోకోను విరమింపచేశారు. అర్ధరాత్రి దాటినా బంకుల ముందు క్యూ లైన్లే దర్శనమిచ్చాయి.

ఎక్కడికక్కడే నిలిచిపోయిన ప్రజా రవాణా : పెట్రోల్, డీజిల్ స్టాక్ లేకపోవడంతో ప్రజా రవాణా వ్యవస్థ వాహనాలు, సరకు రవాణా వాహనాలు, వ్యవసాయ, వాణిజ్య యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పెట్రోల్, డీజిల్ ఎప్పుడు వస్తుందో చెప్పేవారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాహనదారులు అయోమయంలో పడ్డారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బంకులో డీజిల్ అందుబాటులో ఉన్నప్పటికీ పంపిణీ చేయడం లేదని అంటున్నారు. గంటల తరబడి డీజిల్ కోసం బంకు ఎదుట నిరీక్షిస్తున్నామని చెబుతున్నారు.

హార్వెస్టర్లకు డీజిల్ దొరకక రైతుల ఇబ్బందులు : పలు ప్రాంతాల్లో బంకు నిర్వాహకులు తాళం వేసుకొని వెళ్లిపోయారని వాపోయారు. వరి, మొక్క జొన్న కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో కోత యంత్రాలకు (హార్వెస్టర్స్) డీజిల్ దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని వర్షాలు పడితే కల్లాల్లో ఉన్న పంటలు మొలకెత్తే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డీజిల్ పంపిణీ చేయాలని కోరుతున్నారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. జిల్లా సివిల్ సప్లై అధికారులు మాత్రం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పడం గమనార్హం.

 

ఇంధన కొరత లేదు

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డిమాండ్కు మించి సరఫరా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నిన్న డిమాండుకు మించి పెట్రోల్, డీజిల్లను 29 వేల 939 కిలో లీటర్లు సరఫరా చేశామన్నారు. సగటున రోజుకు 5,883 కిలో లీటర్లు పెట్రోల్, 7,348 కిలో లీటర్ల డీజిల్కు డిమాండ్ ఉంటుందన్నారు. కానీ నిన్న మాత్రం 11,490 కిలో లీటర్లు పెట్రోల్, 18,449 కిలో లీటర్లు డీజిల్ను వాహనదారులకు సరఫరా చేసినట్లు వెల్లడించారు. సరఫరాపై క్షేత్ర స్థాయి అధికారులు, పెట్రోల్ కంపెనీల ప్రతినిధులతో తరచూ సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను వాహనదారుల నమ్మొద్దన్ని ఆయన కోరారు. అపోహలతో పెట్రోల్, డీజిల్ను అవసరానికి మించి నిల్వ చేసుకోవద్దని వినియోగదారులకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు.

Related News

Select the Topic
Scroll to Top