ఈతరం భారతం హైదరాబాద్ మే 10
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న ప్రధానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు.దాదాపు గంటసేపు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పనితీరు, తాజా రాజకీయ పరిస్థితులు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.చంద్రబాబు నివాసానికి వెళ్లే ముందు ప్రధాని మోదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ప్రధాని మోదీ, చంద్రబాబు భేటీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముఖ్యంగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.














