ఈతరం భారతం హైద్రాబాద్ మే 14
దేశ ఆర్థిక భద్రత కోసం ప్రధాని మోదీ సూచించిన “సప్త సూత్రాలు – సప్త పరివర్తన”ను ప్రజలు ఆచరించాలని మాజీ ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. బూర నర్సయ్య గౌడ్ పిలుపునిచ్చారు.
గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూదేశ ఆర్థిక భద్రత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించిన “సప్త సూత్రాలు – సప్త పరివర్తన” గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, ముఖ్యంగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, గల్ఫ్ ప్రాంత పరిణామాలు వంటి అంతర్జాతీయ పరిస్థితులు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో భారతదేశం “Developing Nation” నుంచి “Developed Nation”గా ఎదగాలంటే దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరమన్నారు.
దేశ అభివృద్ధి రేటు దెబ్బతినకుండా, భవిష్యత్ ఆర్థిక సవాళ్లను ముందుగానే ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ గారు ప్రజల ముందుకు తీసుకువచ్చిన ఈ సప్త సూత్రాలు రాజకీయాల కోసం కాకుండా దేశ ఆర్థిక భద్రత కోసం చేసినబాధ్యతాయుతమైన విజ్ఞప్తి అని అన్నారు.
భారతదేశం ప్రస్తుతం భారీ ట్రేడ్ డెఫిసిట్‌ను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, ప్రతి సంవత్సరం సుమారు 700 బిలియన్ డాలర్ల దిగుమతులు జరుగుతుండగా, ఎగుమతులు దాదాపు 400 బిలియన్ డాలర్ల వరకు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సుమారు 300 బిలియన్ డాలర్ల ట్రేడ్ డెఫిసిట్ దేశ కరెన్సీ విలువపై ప్రభావం చూపుతోందన్నారు.
దేశ కుటుంబ పెద్దగా ప్రధాని మోదీ గారు 140 కోట్ల భారతీయుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని బాధ్యతాయుతమైన సూచనలు చేశారని పేర్కొన్నారు. “Prevention is Better Than Cure” అన్న సూత్రంతో భవిష్యత్ సంక్షోభాలను ముందుగానే అరికట్టేందుకు ఈ చర్యలు అవసరమని తెలిపారు.
ప్రధాని మోదీ గారు సూచించిన సప్త సూత్రాల్లో ముఖ్యంగా ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని కోరారని, శాశ్వతంగా కొనొద్దని కాదు, కేవలం తాత్కాలిక నియంత్రణ మాత్రమేనని స్పష్టం చేశారు.
భారతదేశం ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశమని, ప్రతి సంవత్సరం దాదాపు 800 టన్నుల బంగారం దిగుమతి అవుతోందని తెలిపారు. దీని విలువ సుమారు రూ.5.5 లక్షల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్ల వరకు ఉంటుందని, ఇందులో 95 శాతం వ్యక్తిగత వినియోగానికే ఉపయోగపడుతోందన్నారు.భారతీయుల వద్ద ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక ప్రైవేట్ గోల్డ్ నిల్వలు ఉన్నాయని, కేవలం 25 శాతం బంగారం కొనుగోళ్లు తగ్గించినా భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదాచేయవచ్చన్నారు. అదే మొత్తాన్ని భూమి, తయారీ రంగం లేదా మార్కెట్లలో పెట్టుబడులుగా మళ్లిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని తెలిపారు.
పెట్రోల్, డీజిల్ దిగుమతులపై భారత్ భారీగా ఖర్చు చేస్తోందని పేర్కొంటూ, ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, కార్ పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచి, అనవసర ప్రయాణాలను తగ్గిస్తే విదేశీ మారక ద్రవ్యం ఆదాఅవుతుందన్నారు.కరోనా సమయంలో విజయవంతంగా అమలైన “Work From Home” విధానాన్ని సాధ్యమైనంత వరకు కొనసాగిస్తే ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
“నేను ఒక డాక్టర్‌గా చెబుతున్నాను… భారతదేశంలో అధికంగా వంటనూనె వినియోగం జరుగుతోంది. ఫ్రైడ్ ఫుడ్స్ అధికంగా తినడం వల్ల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి అనేక వ్యాధులు పెరుగుతున్నాయి. ప్రతి కుటుంబం నెలకు కనీసం ఒక లీటర్ ఆయిల్ వినియోగం తగ్గించినా దేశానికి వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. ప్రజల ఆరోగ్య ఖర్చులు కూడా తగ్గుతాయి” అని డా. బూర నర్సయ్య గౌడ్ గారు పేర్కొన్నారు.
సహజ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా ఎరువుల దిగుమతులను తగ్గించవచ్చని, భూమి సారాన్ని కాపాడటంతో పాటు రైతులకు దీర్ఘకాల ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
“స్వదేశీ” ఉత్పత్తులను వినియోగించాలన్న ప్రధాని పిలుపు వెనుక స్పష్టమైన ఆర్థిక దృష్టి ఉందని పేర్కొంటూ, విదేశీ బ్రాండ్లపై ఆధారపడకుండా భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తే దేశ సంపద దేశంలోనే ఉంటుందన్నారు. చిన్న ఉత్పత్తుల నుంచి లగ్జరీ వాహనాల వరకు స్వదేశీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్‌పై భారతీయులు భారీగా ఖర్చు చేస్తున్నారని, మన దేశంలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పుడు విదేశీ ఖర్చులను కొంతవరకు తగ్గించడం ద్వారా కూడా విదేశీ మారక ద్రవ్యం సేవ్ చేయవచ్చన్నారు.
ఈ సప్త సూత్రాలను ప్రజలు కనీసం 25 శాతం స్థాయిలో అయినా అమలు చేస్తే దేశ ట్రేడ్ డెఫిసిట్‌ను గణనీయంగా తగ్గించవచ్చని, రూపాయి విలువ బలపడుతుందని, భారతదేశం మరింత ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని తెలిపారు.
బంగారం పెట్టుబడుల కంటే భూమి, ఉత్పత్తి రంగాలు, మార్కెట్లలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే Gold ETFలు, Sovereign Gold Bonds వంటి ప్రత్యామ్నాయాల ద్వారా కూడా పెట్టుబడులు పెట్టవచ్చన్నారు.
ప్రధాని మోదీ గారు “Practice What You Preach” అనే విధానాన్ని స్వయంగా ఆచరిస్తున్నారని పేర్కొంటూ, దేశ నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ముందుగా ఈ సూత్రాలను పాటిస్తే ప్రజలు కూడా అనుసరిస్తారని తెలిపారు.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన “యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః” అనే శ్లోకాన్ని ఉదహరిస్తూ, నాయకులు ఏది ఆచరిస్తారో ప్రజలు అదే అనుసరిస్తారని పేర్కొన్నారు. దేశ ప్రయోజనం కోసం అందరూ కలిసి ఈ మార్పులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ అంశాలను రాజకీయ కోణంలో కాకుండా జాతీయ ప్రయోజన దృష్టితో చూడాలని ప్రజలను కోరుతూ, భారతదేశం ఆర్థికంగా మరింత బలోపేతం కావాలంటే ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని డా. బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.














