ఈతరం భారతం న్యూ డిల్లి మే 15 :
ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లని కబురు అందించింది భారత వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు మే 26న కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది. మే 26న రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దీనికి నాలుగు రోజుల అటు ఇటుగా అంటే మే 22 నుంచి మే 30 మధ్య రుతుపవనాలు తాకే అవకాశం ఉండవచ్చని ఐఎండీ వివరించింది. సాధారణంగా కేరళలో రుతుపవనాలు జూన్ 1 నాటికి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి ఉత్తరం వైపునకు విస్తరిస్తూ దేశంలోని మిగిలిన ప్రాంతాలకు చేరతాయి. కేరళలో రుతుపవనాల ప్రవేశం ద్వారా దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే వర్షాకాలం అధికారికంగా ప్రారంభమవుతుంది. రుతుపవనాల రాకపై స్పష్టత రావడంతో దేశవ్యాప్తంగా అన్నదాతలు ఖరీఫ్ సాగు పనులకు సిద్ధమవుతున్నారు. కాగా, గతేడాది రుతుపవనాలు మే 24న ప్రవేశించినట్లు ఆ శాఖ వెల్లడించింది.
తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం
రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. “భారత ప్రధాన భూభాగంలోకి నైరుతి రుతుపవనాల విస్తరణ అనేది కేరళలో వాటి ఆగమనంతో గుర్తిస్తాం. వేడి, పొడి వాతావరణం నుంచి వర్షాకాలంలోకి జరిగే మార్పును సూచించే ఒక ముఖ్యమైన సూచిక ఇది. రుతుపవనాలు ఉత్తరం వైపుగా విస్తరిస్తున్న కొద్దీ, ఆయా ప్రాంతాల్లో వేసవిలో ఉండే తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభిస్తుంది.” అని ఐఎండీ పేర్కొంది.
సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం
ఈ ఏడాది రుతుపవన కాలంలో భారతదేశంలో సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. దేశంలో తక్కువ వర్షపాతానికి కారణమయ్యే ‘ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడటమే దీనికి కారణం కావచ్చని IMD అభిప్రాయపడింది. రుతుపవన కాలాల్లో దేశంలో సాధారణంగా సుమారు 80 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాగా, ఈ రుతుపవన కాలానికి సంబంధించిన దీర్ఘకాలిక సగటు (1971-2020 మధ్య కాలం) 87 సెం.మీగా ఉంది.
దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థికవ్యవస్థకు జీవనాడిగా నైరుతి రుతుపవనాలను పిలుస్తారు. నాలుగు నెలల పాటు సాగే ఈ రుతుపవన కాలం దేశానికి లభించే వార్షిక వర్షపాతంలో దాదాపు 70 శాతాన్ని అందిస్తుంది. వ్యవసాయానికి, పంటలకు, మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థకు, అలాగే జలాశయాలు, భూగర్భ జలాలను తిరిగి నింపడానికి ఇది అత్యంత కీలకం. మన దేశంలో 50 శాతానికి పైగా నికర సాగుభూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40శాతం దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి.














